లావాదేవీలు పూర్తి చేసే కొత్త టెక్నాలజీ

ఓటీపీ

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ప్రజల జనజీవనం స్తంభించింది. చాలా కార్యకలాపాలకు అవరోధాలు ఏర్పడ్డాయి. అయితే అదే సమయంలో ఊహించని పరిష్కారాలు మనకు తారసపడ్డాయి.

క్వారంటైన్‌లో గడుపుతున్న ఓ యువకుడు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)లు సమయానికి రాక, ఒక్కోసారి వచ్చిన పాస్‌వర్డ్‌లతో పని జరగక ఇబ్బంది పడి, ఓ సరికొత్త పరిష్కారంతో ముందుకు వచ్చాడు.

‘‘డేటా అనలిటిక్స్’’ సాయంతో ఈ సమస్యకు అతడు పరిష్కారం కనుగొన్నాడు. ఆన్‌లైన్ లావాదేవీలను తేలిక చేయడంతోపాటు వేగాన్ని పెంచే సాంకేతికతను ఆయన అభివృద్ధి చేశారు. ఈ విధానంలో జరిగే లావాదేవీలకు భద్రత ఎక్కువ ఉంటుందని ఆయన చెబుతున్నారు.

ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు, ఫూడ్ ఆర్డర్ చేసినప్పుడు మన ఈమెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబరును ఎంటర్ చేస్తుంటాం. వీటికి ఓటీపీలను సదరు సంస్థలు పంపిస్తుంటాయి. అయితే, ఒక్కోసారి ఈ ఓటీపీలు సమయానికి రావు.

ఓటీపీ

ఒక్కోసారి వెబ్‌సైట్ లాగిన్ సమయంలో ఇచ్చే పాస్‌వర్డ్‌లు మనం మరచిపోతుంటాం. అప్పుడు ఫర్‌గాట్ పాస్‌వర్డ్ కొట్టాల్సి ఉంటుంది. దీని కోసం చాలా వెబ్‌సైట్‌లు ఓటీపీలు పంపిస్తుంటాయి. ఇవి కూడా తగిన సమయానికి రాకుండా ఇబ్బంది పెడుతుంటాయి.

సరిగ్గా ఇలాంటి సమస్యలతో విసుగు చెందిన ప్రభాత్ సాహు క్రిప్టోగ్రఫీ సాయంతో ఓ కొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు. పాస్‌వర్డ్, ఓటీపీల సాయం లేకుండానే ఇది లావాదేవీలను పూర్తిచేస్తుంది.

‘‘ఓటీపీలతో పోలిస్తే ఈ విధానంలో చాలా తక్కువ సమయంలోనే లావాదేవీలు పూర్తవుతాయి. సాధారణంగా ఓటీపీలతో లావాదేవీలు జరిగేందుకు దాదాపు 1.5 నిమిషాలు పడుతుంది. మరోవైపు ఓటీపీ జెనరేట్ చేయడానికి 19 పైసలు ఖర్చు అవుతుంది. అదే మేం అభివృద్ధి చేసిన విధానంలో అయితే 0.6 సెకన్లలో పని పూర్తవుతుంది. దీనికి ఖర్చు అయ్యేది 5 పైసలు మాత్రమే. ఈ విధానంతో ఏటా బ్యాంకులు 2.6 కోట్ల రూపాయల వరకు ఆదా చేయొచ్చు’’అని బీబీసీతో ప్రభాత్ చెప్పారు.

సావో ల్యాబ్స్ సంస్థను ఆయన నెలకొల్పారు. సావో అంటే సెక్యూర్ అథెంటికేషన్ వితవుట్ ఓటీపీ.

ఓటీపీ

ఇది ఎలా పనిచేస్తుంది?

సావో సాంకేతికతను ఉపయోగించుకునే కంపెనీలు మొదట వినియోగదారుల ఈమెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబరును ఇవ్వాల్సి ఉంటుంది. లాగిన్ సమయంలో వినియోగదారులు వీటిని ఎంటర్ చేయాలి. దీంతో రెండు కీలు జెనరేట్ అవుతాయి. వీటిలో మొదటిది ప్రైవేట్ కీ. రెండోది పబ్లిక్ కీ.

ప్రైవేట్ కీ మన డివైజ్‌లోనే ఉంటుంది. మన ‘‘స్క్రీన్ లాక్’’నే మనం ప్రైవేట్ కీగా పెట్టుకోవచ్చు. పబ్లిక్ కీ సర్వర్‌లో సేవ్ అవుతుంది. వీటి సాయంతో ఓటీపీలు లేకుండానే మనం లావాదేవీలు పూర్తిచేయొచ్చు. మనం ఎంటర్‌చేసే ప్రైవేట్ కీ, పబ్లిక్ కీతో మ్యాచ్ అయినప్పుడు లావాదేవీలు జరుగుతాయి.

‘‘ఆ ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ మీదే అని ప్రైవేట్ కీ ధ్రువీకరిస్తుంది. పబ్లిక్ కీ ప్రతి లావాదేవీకీ మారుతూ ఉంటుంది’’అని ప్రభాత్ చెప్పారు.

ఒకవేళ ఫోన్ పోగొట్టుకున్నా లేదా కొత్త ఫోన్ కొన్నా.. మళ్లీ మనం సావోతో రీకనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది.

ఓటీపీ

ఇది సురక్షితమేనా?

‘‘ఇక్కడ మేం ఎలాంటి వివరాలనూ స్టోర్ చేసుకోం. మా క్లౌడ్ స్టోరేజీ ఖాళీగానే ఉంటుంది. మేం కస్టమర్ల డివైజ్‌లలోనే సమాచారాన్ని స్టోర్ చేస్తాం. కీలు జెనరేట్ చేసే సమయంలోనూ ఎన్‌క్రిప్షన్, డిక్రిప్షన్ విధానాలను అనుసరిస్తాం. ఒకవేళ ఎవరైనా హ్యాక్ చేయాలని అనుకుంటే.. సదరు వ్యక్తి డివైజ్‌నే హ్యాక్ చేయాల్సి ఉంటుంది. సర్వర్లపై ఎలాంటి ప్రభావమూ పడదు’’అని ప్రభాత్ చెప్పారు.

‘‘హ్యాకర్లు క్వాంటమ్ కంప్యూటింగ్ విధానాలను అనుసరిస్తే.. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబరు కనుక్కోవడానికి దాదాపు రెండున్నర గంటలు పడుతుంది. అయినప్పటికీ వారు కేవలం ఒక వ్యక్తి వివరాలు మాత్రమే కనుక్కోగలరు’’అని ఆయన వివరించారు.

సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో ఎక్సీడ్ సంస్థ ఐదున్నర కోట్ల నిధులను సావో ల్యాబ్స్‌లో పెట్టుబడిగా పెట్టింది. రెండు కారణాల వల్ల తాము సావోలో పెట్టుబడులు పెడుతున్నామని ఎక్సీడ్ వివరించింది.

‘‘చాలా తక్కువ ధరకే సావో ల్యాబ్స్ సేవలను అందిస్తోంది. పైగా ఇది సురక్షితమైన విధానంలో అథెంటికేషన్‌లను పూర్తి చేస్తుంది’’అని అని ఎక్సీడ్ అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు.

ఈ విధానం చాలా సురక్షితమైనదని ఐఐటీ మద్రాస్‌లో క్రిప్టోగ్రఫీ ప్రొఫెసర్‌గా పనిచేసిన సీ పాండురంగన్ చెప్పారు. ఆయనకు ఎక్సీడ్ లేదా సావో ల్యాబ్స్‌తో ఎలాంటి సంబంధమూ లేదు.

ఓటీపీ

‘‘సెక్యూరిటీ పరంగా చూస్తే మిగతా విధానాలతో పోలిస్తే ఈ సాంకేతికత మెరుగైనది. బ్లాక్‌చైన్ సాంకేతికత కూడా ఇలానే పనిచేస్తుంది. మన డివైజ్‌లో స్టోర్ అయ్యే ప్రైవేట్ కీని సైనింగ్ కీ అంటారు. వెరిఫికేషన్ కోసం ఉపయోగించేది పబ్లిక్ కీ. బ్లాక్‌చైన్ విధానంలో అవతలివైపు ఎవరున్నారో మనం కనుక్కోలేం. కేవలం కీలను మాత్రమే మనం గుర్తించగలం. ప్రస్తుతం ఇదే విధానంలో సావో ల్యాబ్స్ తాజా సాంకేతికతను అభివృద్ధి చేసింది’’అని ఆయన వివరించారు.

‘‘ప్రైవేటు, పబ్లిక్ కీలతో ఎలాంటి సమస్యా లేదు. సాంకేతిక పరంగానూ ఇది మెరుగైనదే. అయితే చట్టపరంగా అవరోధాలు ఎదురుకావొచ్చు’’అని సైబర్ చట్టాల నిపుణుడు నవీ విజయశంకర్ బీబీసీకి చెప్పారు.

‘‘ఈ సాంకేతికను ఫోడో ప్రోటోకాల్ అంటారు. ఇది క్లౌడ్ ఆధారిత అథెంటికేషన్ వ్యవస్థ. దీనిలో పబ్లిక్, ప్రైవేట్ కీలను జెనరేట్ చేస్తారు. దీనిలో సర్టిఫై చేస్తున్న అధారిటీకి మన ప్రైవేటు కీలు వెళ్లవు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఈ విధానానికి అనుమతి జారీచేయలేదు’’అని ఆయన వివరించారు.

‘‘ఆర్‌బీఐ వివరాల ప్రకారం.. బ్యాంకింగ్ లావేదేవీలను రెండు అంచెల్లో ధ్రువీకరించాలి. అందుకే ఓటీపీ, డిజిటల్ సిగ్నేచర్ విధానాలను సంస్థలు అనుసరిస్తున్నాయి. సావో కూడా క్రిప్టోగ్రఫీ సాయంతో అథెంటికేషన్‌ను పూర్తిచేస్తుంది. ఇది ఫోడో ప్రోటోకాల్‌ను అనుసరిస్తుంది. దీన్ని డిజిటల్ లావాదేవీల్లో ఉపయోగించొచ్చు’’అని ఎక్సీడ్ అధికార ప్రతినిధి అన్నారు.

‘‘2016లో డిజిటల్ సిగ్నేచర్‌కు అనుమతులు ఇస్తూ చట్టాల్లో మార్పులు చేసినట్టే ప్రస్తుతం కూడా కేంద్ర మార్పులు తీసుకురావొచ్చు. అయితే ఇప్పటివరకు ఈ విధానానికి ఎలాంటి అనుమతీ లేదు’’అని విజయశంకర్ చెప్పారు.


Post a Comment

أحدث أقدم