హమ్మయ్య! అందరికీ నెగెటివ్

సిడ్నీకి బయలుదేరేముందు మెల్‌బోర్న్‌లోని టీమ్‌ హోటల్‌ బయట క్రికెటర్లు చతేశ్వర్‌ పుజారా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రా (భారత్‌), లబ్‌షేన్‌ (ఆస్ట్రేలియా)

కరోనా నిర్ధారణ పరీక్షలో భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు పాస్‌ మూడో టెస్టు కోసం సిడ్నీ చేరిన జట్లు

మెల్‌బోర్న్‌: హమ్మయ్య! భారత క్రికెటర్లకే కాదు... క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కే ఇది పెద్ద ఊరట. ఆటగాళ్లంతా కోవిడ్‌–19 పరీక్షల నుంచి నెగెటివ్‌గా బయటపడ్డారు. దీంతో ఈనెల 7 నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు వచ్చిన ముప్పేమీ లేదిపుడు. ‘ఆటగాళ్లతో పాటు జట్టు సహాయ సిబ్బందిలో ఎవరికీ కరోనా సోకలేదు. ఆదివారం వీరందరికీ ‘ఆర్టీ–పీసీఆర్‌’ కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా... సోమవారం ఫలితాలన్నీ నెగెటివ్‌గానే వచ్చాయి’ అని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.

రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్, రిషభ్‌ పంత్, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీ షాలు కరోనా నిబంధనల్ని ఉల్లంఘించారని, బయో బబుల్‌ దాటి బయటకొచ్చి రెస్టారెంట్‌ రుచులు చూశారని గగ్గోలు పెట్టిన ఆసీస్‌ ప్రభుత్వ వర్గాలు ఇక తమ నోటికి తాళం వేసుకుంటాయేమో! ఎందుకంటే ఇప్పటికే ఈ ఉదంతంపై బీసీసీఐతో కలిసి సీఏ ఉమ్మడి దర్యాప్తు చేపడుతుందంటూ చేసిన ప్రకటనలకు ఇక కాలం చెల్లినట్లే! రెస్టారెంట్‌లో భోంచేసిన ఆ ఐదుగురు ఆటగాళ్లను ఐసోలేషన్‌లో ఉంచినప్పటికీ సోమవారం జట్టుతో పాటే సిడ్నీకి చేరుకున్నారు. తాజాగా రిపోర్టులు కూడా నెగెటివ్‌గా రావడంతో ఇప్పుడు అంతా కలిసే ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంటారు.  

Post a Comment

أحدث أقدم