పందేలు జరగకుండా చూడాలని హైకోర్టు పునరుద్ఘాటన నిర్వాహకుల బైండోవర్తో పోలీసుల గట్టి ప్రయత్నాలు ఏటా లాగానే పందేలు నిర్వహించుకోవచ్చని ధీమా
అమరావతి, పాలకొల్లు, న్యూస్టుడే: పందెం కోడి కత్తి కడుతుందా? బరిలో దిగనియ్యబోమన్న పోలీసుల హెచ్చరికలు పనిచేస్తాయా? తెలుగు రాష్ట్రాల్లో పందేలరాయుళ్ల మదిలో ఇప్పుడు ఇవే ప్రశ్నలు. సంక్రాంతికి కోడిపందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ గతంలో తామిచ్చిన ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ హైకోర్టు పునరుద్ఘాటించిన నేపథ్యంలో పోలీసులు ఈసారి కాస్త గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పందేలు నిర్వహించే వారిని బైండోవర్ చేయటం, కత్తుల్ని స్వాధీనం చేసుకోవటం వంటి చర్యలతో నిర్వాహకులకు హెచ్చరికలు పంపుతున్నారు. కానీ పందేలరాయుళ్లు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. కాకపోతే ఎప్పటిలా కాకుండా కాస్త గుట్టుచప్పుడు కాకుండా బరులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆంక్షలు ఎలా ఉన్నా.. ఏటా మాదిరిగానే పందేలు నిర్వహించుకోవచ్చన్న లెక్కతో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల బరుల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా చివరి నిమిషంలో ఆటంకాలన్నీ తొలగిపోయి బరిలో కోడిని దించగలమని ధీమా ప్రదర్శిస్తున్నారు. అయితే కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో పందేల నిర్వహణ జరుగుతుందా అనేది మరికొందరి సందేహం.
కొత్త ప్రదేశాలు ఎంపిక చేసుకుని మరీ
* ఏటా కోడి పందేలు నిర్వహించే ప్రదేశాలపై పోలీసుల నిఘా పెరగటం, అక్కడ ఏర్పాటు చేస్తున్న బరులను గుర్తించి ధ్వంసం చేస్తుండటంతో పందెంరాయుళ్లు దారి మారుస్తున్నారు. రహస్య ప్రదేశాలను ఎంపిక చేసుకుని బరులు సిద్ధం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఉండి, ఆకివీడు, నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, పెనుగొండ, అత్తిలి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు, గణపవరం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బరులు సిద్ధమవుతున్నాయి.
* తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం తదితర ప్రాంతాల్లో బరులు ఏర్పాటు పనులు రహస్యంగా సాగుతున్నాయి. ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెంలో మూడెకరాల వ్యవసాయ భూమిని ఇప్పటికే చదును చేశారు.
* వాహనాలు నిలపడానికి అయిదెకరాల కొబ్బరి తోటను సిద్ధం చేశారు. ముమ్మిడివరం మండలంలోని రాజుపాలెం, మార్కెట్ప్రాంతం, అయినాపురం, కొత్తలంక, పల్లిపాలెం, క్రాపచింతలపూడి, కాట్రేనికోన మండలం చెయ్యేరు, గెద్దనపల్లి, తాళ్లరేవు మండలంలో పిల్లంక, గోవలంక, ఆత్రేయపురం మండలంలో తాడిపూడి, బొబ్బర్లంక, పేరవరం, లొల్ల, ర్యాలి తదితర ప్రాంతాల్లో పందేల నిర్వహణకు రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
* కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు, ఈడ్పుగల్లు, ఉప్పులూరులో బరులు సిద్ధం చేస్తుండగా పోలీసులు ధ్వంసం చేసేశారు. గన్నవరం మండలం అంపాపురంలో బరి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పెనమలూరు మండలం పోరంకి, పెదపులిపాకలో బరులు సిద్ధమవుతున్నాయి. గుడివాడ మండలం లింగవరంలోనూ గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు సాగుతున్నాయి.
గుండాట, పేకాటల నిర్వహణకు ఒప్పందాలు
బరుల వద్ద గుండాట, పేకాట, కోతాట వంటి శిబిరాల నిర్వహణకు అవకాశమిచ్చేందుకు బరుల నిర్వాహకులు గతంలో బహిరంగ వేలం పాట నిర్వహించేవారు. పోలీసుల నిఘా పెరగడంతో ఈసారి అందుకు భిన్నంగా అనధికారిక ఒప్పందాలు జరుగుతున్నాయి. బరుల స్థాయిని బట్టి ఇంత మొత్తం చెల్లిస్తామంటూ జూద నిర్వాహకులు బేరసారాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తాల్లో డబ్బులు చేతులు మారాయి.
మర్యాద పిలుపులు
భోగి రోజు నుంచి ఏదో ఒక విధంగా కోడిపందేలు నిర్వహించొచ్చన్న ధీమాతో ఉన్న పందెం రాయుళ్లు.. ‘మర్యాద పిలుపు’ల్లో తలమునకలై ఉన్నారు. పెద్ద ఎత్తున పందేలు ఆడే అలవాటున్న వారిని ఆహ్వానిస్తున్నారు. ‘సంక్రాంతికి మా ఊరు రండి. కోడిపందేలు, పేకాట, గుండాట అన్నీ భారీగా జరుగుతాయి. ఏ లోటు లేకుండా సకల మర్యాదలతో చూసుకుంటాం’ అని ఆహ్వానిస్తున్నారు. కుటుంబసభ్యులతో వచ్చినా సరే తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇస్తున్నారు. వీరికి కావాల్సిన బస ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. భీమవరం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లోని లాడ్జిల్లో గదులు, ఇతర ప్రదేశాల్లోని అతిథిగృహాలను పండగ రోజుల కోసం ఇప్పటికే అనధికారిక ఒప్పందం కుదుర్చుకుని బుక్ చేసుకున్నారు. మరికొన్ని చోట్ల విశాలమైన గృహాలు, అపార్ట్మెంట్లను సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం వీటికి గిరాకీ పెరిగింది. సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు అద్దె వసూలు చేస్తున్నారు