‘గేమింగ్ మాస్టర్స్’ పేరుతో ఆన్‌లైన్‌గేమ్ టోర్నమెంట్ విజేతలకు రూ.12.5 లక్షలు ప్రైజ్‌మనీ ప్రకటించిన రిలయన్స్ జియో
అనుకుంటాంగానీ ఆన్‌లైన్ గేమ్స్ అనేవి నిన్నా మొన్నటి మాట కాదు. వాటి మూలాలు పాకెట్ బేస్ట్ కంప్యూటర్ నెట్‌వర్కింగ్(1970) జమానాలోనే ఉన్నాయి. మడ్ (మల్టీ యూజర్ డంజన్) తొలితరం ఆన్‌లైన్ కంప్యూటర్ గేమ్స్‌లో ఒకటి. ‘ఐలండ్ ఆఫ్ కెస్మై’ తొలితరం కమర్శియల్ గేమ్. 1980లో ‘యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా’ విద్యార్థులు జాన్ టేలర్, కెల్టన్‌లు ఈ సిక్స్‌ప్లేయర్స్ గేమ్‌కు రూపకల్పన చేశారు. దీనికి సూపర్ రెస్పాన్స్ రావడంతో 1981లో ‘కెస్మై’ పేరుతో గేమ్‌డేవలప్‌మెంట్ కంపెనీ స్థాపించారు.
ఇంటర్‌నెట్ విస్తృతస్థాయిలో అందుబాటులోకి రావడంతో వీడియో గేమ్స్ కన్సోల్ హవా మొదలైంది. ఆటను మరో స్థాయికి తీసుకువెళ్లే నైపుణ్యం పెరిగింది. ఇక 2000 సంవత్సరంలో మాసివ్లీ మల్టీప్లేయర్ ఆన్‌లైన్ గేమ్స్ (ఎంఎంఒ)లు ఊపందుకున్నాయి. ఈ జానర్‌లో వచ్చిన ‘వరల్డ్ ఆఫ్ వార్ క్రాఫ్ట్’ బాగా క్లిక్ అయింది. ‘ఎంఎంవో’ జానర్‌లో వచ్చిన ఆన్‌లైన్ గేమ్స్ స్టార్‌వార్స్ గెలాక్సీ, సిటీ ఆఫ్ హీరోస్, స్టార్‌వార్స్: ది ఓల్డ్ రిపబ్లిక్... మొదలైనవి శబ్భాష్ అనిపించుకున్నాయి.
2010 మలిదశలో ‘బ్యాటిల్ రాయల్ గేమ్ ఫార్మట్’ బాగా పాప్‌లర్ అయింది. ఫొట్‌నైట్ బ్యాటీ రాయల్(2017), అపెక్స్ లెజెండ్ (2019), కాల్ ఆఫ్ డ్యూటీ: వార్ జోన్ (2020)... మొదలైనవి బ్యాటిల్ రాయల్ గేమ్ ఫార్మట్‌లో వచ్చినవే. ఆన్‌లైన్ గేమింగ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని విడిగా, జట్టుగా ప్లేయర్స్ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి, వారి ప్రతిభకు పదును పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పలు ఆన్‌లైన్ గేమింగ్ టోర్నమెంట్స్ మొదలయ్యాయి. ప్లేయర్స్ ఉత్సాహనికి తగ్గట్టుగానే ప్రైజ్‌మనీ కూడా పెరుగుతూ వస్తుంది. ఈ టోర్నమెంట్స్ ప్రత్యక్షప్రసార హక్కుల కోసం చానల్స్ పోటీ పడటం విశేషం.
‘ప్రైజ్‌మనీ గెలుస్తామా లేదా? అనేది వేరే విషయం. మనలోని నైపుణ్యాన్ని స్వయంగా అంచనా వేసుకోవడానికి గేమింగ్ టోర్నమెంట్స్ ఎంతో ఉపయోగపడతాయి’ అంటున్నారు టెక్ నిపుణుడు జెన్‌సెన్.
ప్రపంచవ్యాప్తంగా పాప్‌లర్ అయిన కొన్ని టోర్నమెంట్స్: ఏడు సంవత్సరాల క్రితం మొదలైన ‘కాల్ ఆఫ్ డ్యూటీ ఛాంపియన్‌షిప్’లో సరికొత్త గేమ్స్ కేంద్రంగా పోటీలు జరుగుతాయి. ‘ఇ–స్సోర్ట్స్ వరల్డ్ కన్వెన్షన్’లో రకరకాల జానర్స్ కనబడతాయి. లాస్ వెగాస్‌లో ప్రతి వేసవిలో మొదలయ్యే ఇవాల్యువేషన్ ఛాంపియన్‌షిప్ సిరీస్ (ఈవీవో)కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. లార్జెస్ట్–లాంగెస్ట్ రన్నింగ్ గేమింగ్ టోర్నమెంట్స్‌కు ‘ఈవీవో’ ప్రసిద్ధి పొందింది. ‘ఫిఫా ఇ–వరల్డ్‌కప్’కు ఉన్న ఆదరణ ఇంతా అంతా కాదు. మూడు సంవత్సరాల క్రితం మొదలైన ‘ఫోట్‌నైట్ వరల్డ్ కప్’ ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం ఉద్దండులు పోటీ పడతారు. ఇ–స్పోర్ట్స్ ఒలంపిక్స్‌గా పిలుచుకునే ‘స్టార్‌క్రాఫ్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
జియో తాజా ప్రకటనతో ఆన్‌లైన్ గేమింగ్ ప్రియుల్లో ఉత్సాహం
రిలయన్స్ జియో, తైవాన్ చిప్‌మేకర్ ‘మీడియాటెక్’ భాగస్వామ్యంతో ఆన్‌లైన్‌గేమ్ ప్రియులు కోసం ‘గేమింగ్ మాస్టర్స్’ పేరుతో టోర్నమెంట్ ప్రకటించింది. జనవరి 10 నుంచి మొదలై మార్చి 7 వరకు 70 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ కోసం రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. జియోగేమ్స్ ప్లాట్‌ఫామ్‌లో జనవరి 9 వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు, పార్టిసిపెషన్ ఫీజు అంటూ లేవు. జియో యూజర్లు, నాన్–జియో యూజర్లు అందరూ పాల్గొనవచ్చు.
డుయోస్, సోలోస్, గ్రాండ్‌ఫైనల్... మూడు దశలలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. విజేతలకు రూ.12.5 లక్షలు ప్రైజ్‌మనీగా ప్రకటించారు. ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఉంటాయి.
‘గేమర్స్ నైపుణ్యం, ఓర్పు, టీమ్‌వర్క్ సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఇండియా కా గేమింగ్ ఛాంపియన్‌షిప్ గేమింగ్ మాస్టర్స్ ఉపయోగపడుతుంది’ అంటున్నారు నిర్వాహకులు.
జియోటీవి హెచ్‌డి, ఇ–స్పోర్ట్స్ చానల్, యూ ట్యూబ్ చానల్‌లలో ‘గేమింగ్ మాస్టర్స్’ ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది.