‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’- సాధ్యమేనా?


మరోసారి చర్చనీయాంశమైన జమిలి ఎన్నికలు

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’- సాధ్యమేనా?

దిల్లీ: ‘ఒకేదేశం-ఒకే ఎన్నిక’ నినాదంతో లోక్‌సభ నుంచి స్థానిక సంస్థల వరకు ఎన్నికలన్నీ ఒకేసారి జరగాలనే నినాదం మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలో ఏడాదిలో ఎక్కడోచోట కొనసాగుతోన్న వివిధ ఎన్నికల వల్ల అభివృద్ధికి ఆటంకం కలగడంతో పాటు ఎన్నికల నిర్వహణ ఖర్చు కూడా భారీగా పెరిగిపోతుందనే వాదన ఉంది. వీటి నుంచి బయటపడేందుకు జమిలి ఎన్నికల నిర్వహణే సరైన మార్గమనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఈ అంశాన్ని భారత ప్రధాని మోదీ గత కొంతకాలంగా పదేపదే ప్రస్తావించడంతో పాటు భాజపా కూడా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా చర్చించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఏమిటీ జమిలి ఎన్నికలు..?
ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానంలో పార్లమెంట్‌ నుంచి స్థానిక సంస్థలకు లేదా పార్లమెంట్‌తో పాటే రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్‌ బూత్‌కి వెళ్లిన ఓటరు ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థ ప్రతినిధికి ఓటు వేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒక నిర్ణీత వ్యవధిలో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. దీంతో ఏటా విడివిడిగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిపే అవసరం ఉండదు.

గతంలో జరిపినవే..
దేశంలో 1951-1952లో తొలిసారిగా జరిగిన సాధారణ ఎన్నికలు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జరిగాయి. తర్వాత 1957, 1962, 1967ల్లోనూ ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే 1968-69 మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం కారణంగా ఒకేసారి ఎన్నిక విధానానికి ఆటంకం ఏర్పడింది. తర్వాత 1970 జరిగిన ఎన్నికల్లోనూ పూర్తి కాలపరిమితి ముగియకుండానే లోక్‌సభ రద్దు అయ్యింది. ఆ సమయంలో నాలుగో లోక్‌సభ మూడు సంవత్సరాల పదినెలలు మాత్రమే కొనసాగింది. మళ్లీ 1971లో లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించారు. 1977లో జరిగిన ఆరో లోక్‌సభ కూడా కేవలం రెండు సంవత్సరాల ఐదు నెలలపాటే కొనసాగింది. 1989, 1996, 1998 పర్యాయాల్లోనూ కేవలం ఒక్క ఏడాదికిపైగా మాత్రమే లోక్‌సభ కొనసాగింది. ఇక కొన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్రపతిపాలన కారణంగా లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి వీలులేకుండా పోయింది.

వాదన అప్పుడే మొదలు

జమిలి ఎన్నికలు జరపాలనే వాదన 1983లో మళ్లీ మొదలైంది. ఏకకాలంలో ఎన్నికలు జరపాలనే ఆలోచనను 1983లో ఎన్నికల సంఘమే ముందుకు తెచ్చింది. 1999లో జస్టిస్‌ జీవన్‌ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన లా కమిషన్‌ కూడా లోక్‌సభతో పాటు అన్ని అసెంబ్లీల స్థానాలకు ఎన్నికలు జరపాలని తన నివేదికలో అభిప్రాయపడింది. 2015లో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కూడా ఒకేసారి ఎన్నికల సాధ్యాసాధ్యాలను నివేదించింది. మొదట్లో ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడు.. లోక్‌సభ, శాసనసభలకు కలిపి ఎన్నికలు పెట్టాలనే డిమాండ్‌ ప్రారంభమైంది. తరువాత అది మరుగునపడిపోయింది. కానీ, 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జమిలి ఎన్నికలు మరోసారి తెరపైకి వచ్చాయి.

రాజకీయ పార్టీల భిన్నాభిప్రాయాలు..
జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2015లో వీటిపై చర్చ సందర్భంగా ఏఐఏడీఎంకే, డీఎండీకే, అసోం గణపరిషత్‌, శిరోమణి అకాలీదళ్‌తో పాటు మరికొన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. కానీ, కాంగ్రెస్‌, తృణమూల్‌, ఎన్‌సీపీ, సీపీఐ, ఏఐఎంఐఎం వంటి పార్టీలు జమిలి ఎన్నికల ఆలోచన అసాధ్యమని వ్యతిరేకించాయి. అంతేకాకుండా ఏ రాజకీయ పార్టీకీ మెజారిటీ లేని పక్షంలో (హంగ్‌ అసెంబ్లీలు) ఇబ్బందులు ఎదురైతే పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల కోడ్‌తో అభివృద్ధికి ఆటంకం..
ఏటా దేశంలో ఎక్కడోచోట ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటోంది. దీంతో అభివృద్ధి పనులకు, పాలనకు తీవ్ర ఆంటంకం ఏర్పడుతుంది. ఉదాహరణకు 2014లో జరిగిన ఎన్నికల సమయంలో దాదాపు 7నెలల పాటు దేశంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. దేశవ్యాప్తంగా 3 నెలల పాటు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా.. వివిధ రాష్ట్రాల్లో 4 నెలలు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. 2015లోనూ బిహార్‌, దిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా మూడు నెలలు కోడ్‌ అమల్లో ఉంది. 2016లో అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా రెండు నెలలు కోడ్‌ అమలులో ఉంది. ఇలా ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో ప్రభుత్వాధికారులు ఎన్నికల విధుల్లో ఉండటం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందనే వాదన ఉంది.

భారీ ఖర్చు.. 
లోక్‌సభ ఎన్నికల నిర్వహణ ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుండగా, శాసనసభల ఎన్నికల ఖర్చులు ఆయా రాష్ట్రాలు భరిస్తాయి. 2009 లోక్‌సభ ఎన్నికలకు దాదాపు రూ.1115కోట్ల రూపాయలు ఖర్చు కాగా, 2014 నాటికి ఆ ఖర్చు రూ.3870 కోట్లకు పెరిగింది. 2019 ఎన్నికల ఖర్చు వీటికంటే ఎక్కువే. ఇక రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ కూడా భారీగానే ఉంటుంది. ఇలా వేర్వేరు సమయంలో ఎన్నికలు నిర్వహణ వల్ల ఇరు ప్రభుత్వాలకు ఎన్నికల వ్యయం భారీగా అవుతోంది. అంతేకాకుండా అభ్యర్థుల ప్రచారం, భద్రతా సిబ్బంది వంటికి మళ్లీ మళ్లీ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒకేసారి ఎన్నికల వల్ల రాష్ట్రాలు, కేంద్రానికి ఎన్నికల వ్యయ భారం సగం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విధుల్లో లక్షల మంది భద్రతా సిబ్బంది..
దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ స్థాయిలో పోలింగ్‌ సిబ్బందితో పాటు భద్రతా బలగాలను వినియోగించుకుంటుంది. గత ఎన్నికల్లో దాదాపు కోటి మంది సిబ్బందితో ఎన్నికలను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 9 లక్షల 30 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఒక్కో పోలింగ్‌ బూత్‌కు పదిమంది చొప్పున సిబ్బంది ఉండాల్సి వస్తోంది. వీటి కోసం ప్రభుత్వ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీస్‌లను భారీస్థాయిలో వినియోగించాల్సి వస్తుంది.

భాజపా వాదన ఇదీ..
జమిలి ఎన్నికల వల్ల కొన్ని జాతీయ పార్టీలు లేదా బలమైన నాయకులకే ప్రయోజనం ఉంటుందనే విమర్శలున్నాయి. అయితే, వీటిని భాజపా ఖండిస్తోంది. ఇందుకు ఒడిశా ఎన్నికలను ఉదాహరణగా చూపిస్తోంది. అక్కడి శాసనసభ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగినప్పటికీ రాష్ట్రంలో ఒక పార్టీకి, జాతీయ స్థాయిలో మరో పార్టీవైపే ప్రజలు మద్దతు చూపారని సూచిస్తున్నారు. ఎన్నికల్లో నిల్చున్న నాయకులకు ఎవరికి ఓటు వేయాలనే దానిపై ఓటర్లకు స్పష్టత ఉంటుందని పేర్కొంటున్నారు. స్థానిక ఆకాంక్షలు, జాతీయ ఆశయాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఓటర్లు చూపిస్తారని తెలిపారు. కేవలం అభివృద్ధి ఎన్నికల ఖర్చే కాకుండా భద్రతా దళాలను సరైన విధంగా వినియోగించుకోవడానికి ఈ జమిలి ఎన్నికలు దోహదపడుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

రాష్ట్రపతి, ప్రధాని మద్దతు..

దేశంలో ఒకేసారి లోక్‌సభ నుంచి స్థానిక సంస్థల వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రతిఒక్కరూ ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేశారు. అభివృద్ధికి దోహదం చేసే వీలున్న జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంట్‌ సభ్యులను కోరారు. అంతేకాకుండా దీనిపై రాజకీయ పార్టీలన్నీ కలిసి ఆలోచన చేస్తే ఎన్నికల విధానంలో మార్పును తేవచ్చని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరిపేందుకు భాజపా డిసెంబర్‌ చివరివారంలో దాదాపు 25 వెబినార్లు నిర్వహించింది. జమిలి ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధమేనని కేంద్ర ఎన్నికల సంఘం సైతం ప్రకటించింది. అయితే, దానికి సంబంధించిన నిర్ణయాధికారం తమది కాదని, అందుకు విస్తృత చట్ట సవరణ అవసరం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా పేర్కొన్నారు. దీనిపై పార్లమెంట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నీతి ఆయోగ్‌ కూడా ఎన్నికల నిర్వహణపై దృష్టిసారించింది. ఏటా దేశంలో పలుచోట్ల ఎన్నికలు జరుగుతున్న  తీరును విశ్లేషించింది. ప్రధాన మంత్రితో పాటు జస్టిస్‌ జీవన్‌ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్‌ నివేదికను నీతి ఆయోగ్‌ పునరుద్ఘాటించింది. పదేపదే ఎన్నికలతో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆటంకం కలగడం నిజమేనని తెలిపింది. ఎన్నికల ఖర్చు, బ్లాక్‌ మనీ, ఎక్కువ సమయం, ప్రభుత్వ, భద్రతా సిబ్బంది ఎన్నికల్లో పాల్గొనడం వంటి అంశాలపై చర్చించింది. జమిలి ఎన్నికలపై విమర్శకులు చేస్తున్న వాదనలను కూడా అధిగమించవచ్చని అభిప్రాయపడింది.

జమిలి వస్తే.. ఓటరు ఐదేళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే పోలింగ్‌ బూత్‌కు వెళ్తారు. ఒకేసారి స్థానిక, అసెంబ్లీ, లోక్‌సభ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. పాలనే ప్రధాన కేంద్ర బిందువుగా మారే ఈ ప్రక్రియతో ఎన్నికల ఖర్చులు, ఎన్నికల కోడ్‌లు లేకుండా ఎన్నికైన అన్ని విభాగాలు ఐదేళ్లపాటు సరిగా పాలనపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని వీటికి మద్దతు పలికే వారు వాదిస్తున్నారు. ఒకవేళ అన్ని ఎన్నికలు ఒకేసారి జరపాల్సి వస్తే వచ్చే సమస్యలపైనే ప్రధానంగా చర్చ జరగాలని సూచిస్తున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా వీటి సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతోంది.

Post a Comment

أحدث أقدم