కృష్ణా నదిలో ప్రమాదకర ప్రయాణం


పడవ వెంటే మూగజీవాల తరలింపు


నాగర్‌కర్నూల్‌‌: తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నుంచి కర్నూలు జిల్లా సిద్దేశ్వరం, సంగమేశ్వరం, బండి ఆత్మకూరు వైపు ప్రమాదకర పడవ ప్రయాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనుషులనే కాకుండా మూగజీవాలను సైతం ప్రమాదకర పరిస్థితుల్లో కృష్ణా నదిని దాటిస్తున్నారు. అక్కడి పరిస్థితులకు అద్దంపట్టే దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కొల్లపూర్‌ మండలం సోమశిలకు సమీపంలోని నది ఒడ్డు నుంచి అవతలి వైపునకు మరబోటు సహా నాటు పడవలో మనుషులు ప్రయాణిస్తూ మూగజీవాలను మాత్రం పడవ వెంట నీటిలోనే తీసుకెళ్తున్న దృశ్యాలు బయటకొచ్చాయి. ఓ ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ కోసం అక్కడికి వెళ్లిన వీడియోగ్రాఫర్లు.. నదిలో కనిపించిన ఈ దృశ్యాలను చిత్రీకరించారు. 


ప్రతి బుధవారం సింగోటంలో పశువుల సంత జరుగుతోంది. దీనిలో పశువులను కొనుగోలు చేసే రైతులు మూగజీవాలను ఇలా తరలిస్తూ నది దాటిస్తుంటారు. రోడ్డుమార్గం ద్వారా నది అవతలివైపునకు వెళ్లాలంటే సుమారు 200కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. అదే నదిలో అయితే 2కి.మీ ప్రయాణిస్తే అవతలి ఒడ్డుకు చేరుకోవచ్చు. వ్యయ, దూర, సమయాభావాన్ని తగ్గించుకునేందుకు ఇలాంటి ప్రయాణాలు నిత్యం కొనసాగుతూనే ఉంటాయి. 2007 జనవరి 18న సింగోటం జాతర కోసం బండి ఆత్మకూరు నుంచి మంచాలకట్ట వైపు వస్తున్న నాటు పడవ మునిగి 61 మంది అక్కడికక్కడే జలసమాధి అయ్యారు. సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో ఈ తరహా ప్రయాణాలు కొనసాగుతున్నాయి. 

Post a Comment

أحدث أقدم