ప్రొద్దుటూరు : కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య దారుణహత్యకు గురయ్యారు. సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మారణాయుధాలతో దాడి చేయడంతో సుబ్బయ్య తల ఛిద్రమైంది. హత్య గురించి సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తెదేపా జిల్లా అధికార ప్రతినిధిగా వ్యవహరించిన సుబ్బయ్య రాజకీయంగా విమర్శలు చేస్తూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అనంతరం ప్రత్యర్థి పార్టీ శ్రేణులు ప్రతి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో హత్య జరగడం కలకలం రేపుతోంది. రాజకీయ కోణంలోనే ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అందుకే సుబ్బయ్యను హతమార్చారు: చంద్రబాబు
ప్రొద్దుటూరులో తెదేపా నాయకుడు సుబ్బయ్య హత్యను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. చేనేత కుటుంబానికి చెందిన సుబ్బయ్య హత్య కిరాతక చర్య అని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల నాయకులను భౌతికంగా మట్టుబెట్టడమే వైకాపా లక్ష్యంగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్‌లో వైకాపా ఎమ్మెల్యే, ఆయన బావమరిది పాత్రను బహిర్గతం చేశాడన్న కక్షతో సుబ్బయ్యను హతమార్చాడరని ఆరోపించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లిన తెదేపా నాయకుడిని హత్య చేయించడం సీఎంకు సిగ్గు చేటన్నారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. గత 19నెలల్లో రాష్ట్రంలో అనేకమంది తెదేపా నాయకులు, కార్యకర్తలను బలిగొన్నారన్నారు. రాష్ట్రాన్ని క్రిమినల్స్‌కు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. హంతకులను కఠినంగా శిక్షించి సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.