2020లో సినిమా పరిశ్రమ కోల్పోయిన తారలు
ఇంటర్నెట్ డెస్క్: సినిమా అంటేనే వినోదం.. వినోదం.. వినోదం. అలా ఎంతోమందికి వినోదాన్ని అందించే సినిమా పరిశ్రమను ఈసారి విషాద ఘటనలు విస్మయానికి గురి చేశాయి. ప్రతి ఏటా కొత్తకొత్త సినిమాలతో మన ముందుకు వచ్చే సినిమా ఇండస్ట్రీ ఈసారి చేదు వార్తలు.. విషాద ఛాయలతో కన్నీళ్లు పెట్టుకుంది. పరిశ్రమకు పెద్దదిక్కులను కోల్పోయి భోరున ఏడ్చింది. అసలే ఓవైపు కరోనా విలయతాండవం చేస్తుంటే.. మరోవైపు దిగ్గజ నటుల మృతి వార్తలతో పరిశ్రమ విలవిల్లాడింది. ఇలా 2020లో సినీ కళామతల్లి కన్నీళ్లు మిగిల్చిన విషాదఘటనలేంటో ఓసారి చూద్దాం.
ఇడియన్2తో మొదలు..
నిజానికి.. చిత్ర పరిశ్రమ ఎప్పటిలాగే ఎంతో ఉత్సాహంతో ఈ ఏడాది(2020)లోకి అడుగుపెట్టింది. అంతా సవ్యంగానే సాగుతోందనుకున్న సమయంలోనే ఓ చేదు వార్త.. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఇండియన్2’లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్‌కు కట్టిన రోప్ తెగిపోవడంతో అది కూలిపడింది. ఫిబ్రవరి 20న చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై భారతీయ సినీ పరిశ్రమ మొత్తం స్పందించింది. దేశ సినిమా చరిత్రలో ఇది ఒక చీకటి దినంగా విచారం వ్యక్తం చేసింది.
బాలీవుడ్‌లో ప్రకంపనలు
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌ను విస్మయానికి గురి చేసింది. జూన్ 14న ఆయన తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుశాంత్ కేవలం 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడం ఎంతో మందిని కలచివేసింది. బిహార్‌లోని పాట్నాలో 1986 జనవరి 21న జన్మించిన సుశాంత్.. ఎం.ఎస్.ధోనీ (ది అన్‌టోల్డ్ స్టోరీ), చిచోరే వంటి చిత్రాలతో అభిమానులకు మరింత దగ్గరయ్యారు. అయితే.. సుశాంత్ మృతి కేసు ఇప్పటికీ వీడని మిస్టరీగానే ఉండిపోయింది. ఈ కేసులో భాగంగా బయటికి వచ్చిన డ్రగ్స్ బాగోతం.. అటు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టించింది.
మూగబోయిన అమృత కంఠం
‘‘2020 సెప్టెంబరు 25.. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి’’ ఈ వార్తతో యావత్‌సంగీత ప్రపంచంలో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. అప్పటికే కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయనకు కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కరోనా నెగెటివ్‌గా నిర్దారణ అయింది. అయితే.. ఆయన ఆరోగ్యం మాత్రం మెరుగుపడలేదు. ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తూ.. చివరకు తుదిశ్వాస విడిచారాయన. భారతీయ ఛానెళ్లతో పాటు విదేశీ న్యూస్ ఛానెళ్లు సైతం ఎస్పీబీ ఇక లేరనే చేదువార్తను బ్రేకింగ్ న్యూస్‌గా వేశాయి. అలా ఆయన మరణంతో ఎంతో మంది గాయకులు, అభిమానులు భోరుమన్నారు. ఎస్పీబీ మృతి సినిమా ప్రపంచానికి తీరని లోటును మిగిల్చింది. 40ఏళ్ల వృత్తిగత జీవితంలో ఎన్నో భాషల్లో 40వేలకు పైగా పాటలకు ఆయన గొంతును అందించారు.
సీమ నవ్వులకు సెలవు పెట్టి..
తెలుగు సినీ పరిశ్రమకు ఈ ఏడాది మరో విషాదం అంటే.. అది సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతూ ఆయన ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. సెప్టెంబర్ 8న(మంగళవారం) తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. కమెడియన్‌గా.. విలన్‌గా తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జయప్రకాశ్ రెడ్డి ఇకలేరన్న వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి.
దేశం గర్వించదగ్గ నటుడి వీడ్కోలు
సహబ్జేద్ ఇర్ఫాన్ అలీ ఖాన్.. మనకు తెలిసిన ఇర్ఫాన్‌ఖాన్. భారతదేశం గర్వించదగ్గ నటుడు. రాజస్థాన్‌లో 1967 జనవరి 7న జన్మించిన ఇర్ఫాన్‌ఖాన్ బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు బ్రిటిష్, అమెరికన్ సినిమాల్లోనూ నటించారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘లైఫ్ ఆఫ్ పై’ చిత్రాలతో ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ (కేన్సర్) బారిన పడ్డారు. లండన్‌లో చికిత్స తీసుకొని కోలుకున్న తర్వాత ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. మరోసారి ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ ఏప్రిల్ 29న ప్రాణాలు విడిచారు. ‘సైనికుడు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.
బాలీవుడ్‌కు మరో దెబ్బ..
రిషి కపూర్ మరణం వార్త.. బాలీవుడ్‌ను మరింత విషాదంలోకి నెట్టింది. ఒక్కరోజు వ్యవధిలోనే ఇద్దరు దిగ్గజ నటులు మృతిచెందడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. సీనియర్ నటుడు రిషికపూర్ (67) కేన్సర్‌తో పోరాడుతూ.. ఏప్రిల్30న తుదిశ్వాస విడిచారు. 1952 సెప్టెంబర్ 4న జన్మించిన రిషికపూర్.. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. 'మేరా నామ్ జోకర్' సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. బాలీవుడ్‌లో ఎంతో విజయవంతమైన నటుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. సినీ పరిశ్రమ మీద అభిమానంతో తన కూమారుడు రణ్‌బీర్ కపూర్‌ను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు.