కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’కు చురుగ్గా ఏర్పాట్లు
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్
విజయవాడ: కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’కు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరో గురుతర బాధ్యత అప్పగించింది. కోవిడ్ వాక్సిన్ ‘డ్రై రన్’కి ఎంపిక చేసిన నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పేరు చేర్చించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వాక్సిన్ ట్రయిల్ రన్‌కు కృష్ణా జిల్లా అధికారులు సన్నద్ధమౌతున్నారు. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ రేపటి (ఆదివారం) నుంచి మూడు రోజులు నిర్వహిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. 27న ఐటీ రిలేటెడ్ డ్రై రన్, 28న లాజిస్టిక్ రిలేటెడ్ మాక్ డ్రిల్, 29న వాక్సినేషన్ ట్రయిల్ రన్ నిర్వహిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో కొ-విన్ అప్లికేషన్ పనితీరును పరిశీలిస్తామని పేర్కొన్నారు. (చదవండి: కరోనా: ఆ టీకా తీసుకున్న వైద్యుడికి అలర్జీ)
యూకే నుంచి ఇప్పటివరకూ 230 మంది జిల్లాకు వచ్చారని, 122 మందికి కోవిడ్ టెస్టులు పూర్తిచేశామని కలెక్టర్ తెలిపారు. అందులో ఒకరికి పాజిటివ్ వచ్చిందన్నారు. శాంపిల్‌ను పుణే ల్యాబ్‌కి పంపించామన్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్ పై ప్రత్యేక దృష్టిపెట్టామని, ఎయిర్‌పోర్టులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. (చదవండి: కీలక దశకు కోవాగ్జిన్ ప్రయోగాలు)
ఐదు ప్రాంతాలు ఎంపిక:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌కి వైద్యారోగ్య శాఖ.. కృష్ణా జిల్లాను ఎంపిక చేసింది. డ్రైరన్ కోసం జిల్లాలోని ఐదు ప్రాంతాలు ఎంపిక చేశామని జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ సుహాసిని తెలిపారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి, ఉప్పులూరు పీహెచ్‌సీ, విజయవాడ పూర్ణ ప్రైవేట్ ఆస్పత్రి, ప్రకాష్‌నగర్ అర్బన్ పీహెచ్‌సీ, తాడిగడప ప్రభుత్వ పాఠశాలలో డ్రైరన్‌కు ఏర్పాట్లు చేశామన్నారు.
పోలింగ్ తరహాలో వ్యాక్సిన్ డ్రై రన్‌కు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మాక్ డ్రిల్ మాదిరిగానే డ్రై రన్ నిర్వహిస్తామని వివరించారు. పోలింగ్ కేంద్రం తరహాలోనే ఎంట్రీ, ఎగ్జిట్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రతీ కేంద్రంలో 25 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేసినట్లుగా ట్రైల్ రన్ నిర్వహిస్తామన్నారు. ఈ డ్రై రన్ ద్వారా వైద్య,ఆరోగ్య సిబ్బందికి అవగాహన పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
నేడు శిక్షణా కార్యక్రమం..
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ట్రైల్ రన్ కోసం పంజాబ్, అస్సాం, గుజరాత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఎంపిక చేసింది. వ్యాక్సిన్ డ్రై రన్ ఎలా నిర్వహించాలో కేంద్రం ప్రత్యేక సూచనలు చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ ట్రైల్ రన్ కోసం మన రాష్డ్రంలో కృష్ణా జిల్లాను ఎంపికచేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ పర్యవేక్షణలో ట్రైల్ రన్ నిర్వహిస్తారు. ఎంపిక చేసిన సిబ్బందికి నేడు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు. రేపు(ఆదివారం) ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లను ఉన్నతాధికారులు, కేంద్ర పరిశీలకులు పరిశీలించనున్నారు.