అక్కడ ప్రతి 85మందిలో ఒకరికి వైరస్!


అక్కడ ప్రతి 85మందిలో ఒకరికి వైరస్!

లండన్‌: కరోనా వైరస్‌ ధాటికి బ్రిటన్‌ వణికిపోతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి కేసులు నమోదవుతుండగా తాజాగా కొత్తరకం కరోనా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. దీంతో లక్షల మంది ప్రజలు క్రిస్మస్‌ వేడుకలకు దూరంగా ఉన్నారు. అయితే, తాజా నివేదిక ప్రకారం.. ఇంగ్లాండ్‌లో ప్రతి 85 మందిలో ఒకరికి వైరస్‌ బయటపడుతున్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా డిసెంబర్‌ రెండో వారం నుంచి వైరస్‌ తీవ్రత మరింత పెరిగినట్లు అక్కడి జాతీయ ఆరోగ్యసేవా కేంద్రం వెల్లడించింది.

కరోనా విజృంభణతో యూకే ప్రజలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా డిసెంబర్‌ 10 నుంచి 16 మధ్య నమోదైన కేసుల సంఖ్య అంతకు ముందు వారంతో పోలిస్తే 58 శాతం పెరిగినట్లు అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు. కేవలం వారం రోజుల్లోనే లక్షా 73వేల మందిలో వైరస్‌ బయటపడినట్లు పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లో కొవిడ్‌ పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి 85 మందిలో ఒకరికి వైరస్‌ బయటపడుతుండగా, వేల్ నగరం‌లో అరవై మందిలో ఒకరికి వైరస్‌ నిర్ధారణ అవుతున్నట్లు అక్కడి జాతీయ గణాంకాల కార్యాలయం వెల్లడించింది.

మరిన్ని ఆంక్షలు తప్పవు: బ్రిటన్‌ ప్రధాని

బ్రిటన్‌లో ఒక్కసారిగా పెరిగిన వైరస్‌ తీవ్రతకు కొత్తరకం స్ట్రెయిన్‌ కారణమని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, కొన్ని ప్రాంతాల్లో పూర్తి లాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షల అమలుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కొత్తరకం స్ట్రెయిన్‌ వ్యాప్తి చేయి దాటిపోకుండా మరిన్ని కఠిన ఆంక్షలు విధించాల్సి వస్తుందని బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ హెచ్చరించారు. కేవలం కఠిన ఆంక్షలతోనే ఈ దారుణ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని అక్కడి ప్రజలకు మరోసారి గుర్తుచేశారు. ఈ కీలక సమయంలో సాధ్యమైనంత త్వరగా వృద్ధులకు వ్యాక్సిన్‌ అందించి వారిని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రకం వైరస్‌ ప్రమాదకరంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించక తప్పదని బోరిస్‌ జాన్సన్‌ అభిప్రాయపడ్డారు. అయితే, వ్యాక్సిన్‌ పంపిణీ పెంచడంతో రానున్న కొన్ని రోజుల్లోనే సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే 6 లక్షల 16వేల మందికి తొలి డోసు అందించినట్లు బ్రిటన్‌ ప్రధాని పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم