ANWtv: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం కూడా అధికారులతో పలు కీలక అంశాలపై చర్చించింది. రెండు రోజుల కసరత్తు అనంతరం కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్పించడం, అనర్హుల ఓట్లను తొలగించడం, జాబితాలో ఉన్న ఓటర్లు అందరూ ఓట్లు వేసేలా చూడడం తమ ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని ఆయన చెప్పారు. ఎన్నికల అధికారులు ఒక పార్టీకో లేదా అభ్యర్థికో సానుకూలంగా నడుచుకుంటే ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని రాజీవ్‌కుమార్ హెచ్చరించారు. వివిధ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, మిగతా వాటిని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఓట్ల తొలగింపు, పెద్ద సంఖ్యలో ఓట్లను చేర్చడం, సున్నా డోర్ నంబర్‌తో భారీగా ఓట్లు నమోదు కావడంపై వివిధ పార్టీలు ఫిర్యాదులు చేశాయని రాజీవ్ కుమార్ తెలిపారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్, ఆప్, బీఎస్‌పీ పార్టీలకు చెందిన ప్రతినిధులు పలు అంశాలపై ఫిర్యాదులు అందజేశారని తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని కొన్ని పార్టీలు కోరినట్టు వివరించారు. కొంతమంది ఎన్నికల సిబ్బంది, బీఎల్‌వోలు ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ఫిర్యాదులందాయని రాజీవ్‌కుమార్ చెప్పారు. ఓటర్ల జాబితాలో మార్పులపై మరింత దృష్టిపెట్టాలని, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని, డబ్బు పంపిణీకి అడ్డుకట్ట వేయాలని పలు పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటర్లుగా ఉన్నవారి పేర్లను తొలగించాలని ఓ పార్టీ కోరిందని చెప్పారు. ఏపీలో ఎన్నికల సిబ్బంది పక్షపాత ధోరణితో నడుచుకుంటున్నారని కొన్ని ఫిర్యాదులు అందాయన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30 మధ్య పునః పరిశీలన చేసి 13,061 ఓట్లు పునరుద్ధరించామని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ ఓట్లు అర్హత కలిగినవని గుర్తించామని చెప్పారు. కాగా ఇదే కాలంలో 21 లక్షల ఓట్లు తొలగించామని వివరించారు. ఒకే డోర్ నంబరుతో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్ల సంఖ్య 1.57 లక్షలుగా ఉన్నాయని చెప్పారు. సున్నా లేదా అసంబద్ధ ఇంటి నంబర్ కలిగిన ఇళ్లు 2.52 లక్షలు ఉన్నట్లు గుర్తించామని, ఆ అడ్రస్‌లను సవరించామని తెలిపారు. ఏ వ్యక్తికైనా రెండు ఓట్లు ఉంటే అది నేరం కింద పరిగణించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఓటు మార్చుకోవాలనుకునేవారు నిర్దిష్ట కాలం ఈ ప్రాంతంలో నివసించి ఉంటే ఓటు హక్కు లభిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల నామినేషన్ల చివరి తేదీ వరకూ ఈ మేరకు ఓటు నమోదుకు ఛాన్స్ ఉంటుందని చెప్పారు.
కాగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో రెండు రోజులపాటు పాటు కీలక సమావేశాలు ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులతో సమీక్షలు నిర్వహించింది. ఇక రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీలు నిర్వహించి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన విషయాలను కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్‌కుమార్ బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్‌గోయల్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌కుమార్ మీనాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయిలో ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ అధికారులు, ఇతరత్రా సిబ్బంది పనిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆయా జిల్లా అధికారులదేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారిపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాల్ని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర సరిహద్దుల్లో 139 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, డబ్బు, మద్యం తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. కాగా రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో 1.99 కోట్ల మంది పురుషులు, 2.07 కోట్ల మంది మహిళలు ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. దివ్యాంగ ఓటర్ల సంఖ్య 4.76 లక్షలు, వృద్ధులు 5.8 లక్షలు, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 3,486 మంది ఉన్నారని వెల్లడించారు.