హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న బీఆర్‌ఎస్ (BRS) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్‌లో (Vasant vihar) నిర్మించిన బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) ప్రారంభించనున్నారు. ఇందులోభాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరారు. బేగంపేటలోని ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయణమయ్యారు. మధ్యాహ్నం 1:05 గంటలకు బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు. ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. అనంతరం పార్టీ సమావేశపు హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు.
కాగా, ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ 2004లోనే ఆలోచించారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రాంతీయ పార్టీలకు స్థలాలను కేటాయించారు. ప్రాంతీయ పార్టీలకు ఢిల్లీలో స్థలాలను కేటాయించాలంటే ఆ పార్టీకి కనీసం ఐదుగురు ఎంపీలు ఉండాలి. ఐదుగురు ఎంపీలు ఉంటే 500 చదరపు గజాలు, 15 మందికి పైగా ఎంపీలు ఉన్న పార్టీకి 1,000 గజాల స్థలాన్ని కేటాయిస్తారు. బీఆర్‌ఎస్‌కు 2004లో ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉండటంతో కేసీఆర్ ఆ సమయంలో కార్యాలయం కోసం స్థలం ఎంపికను వాయిదావేశారు. పార్టీకి ప్రస్తుతం 16 మంది ఎంపీలు ఉన్నారు. వెయ్యి గజాల స్థలం కేటాయించడానికి నిబంధనలు అంగీకరిస్తాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలు స్థలాలను పరిశీలించిన అనంతరం వసంత్‌విహార్‌లో ఎంపిక చేశారు. టీఆర్‌ఎస్‌గా పార్టీ కార్యాలయానికి భూమిపూజ నిర్వహించుకోగా బీఆర్‌ఎస్‌గా కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం విశేషం. భూమిపూజ జరిగిన 29 నెలల్లోనే కార్యాలయ నిర్మాణం పూర్తవ్వడం మరో విశేషం.