సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.. ప్రజలకు దూరం తగ్గిస్తున్నాం.. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం చెప్పిన మాట ఇది.
Registrations in Secretariats: రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం చేసి ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుకు సంబంధించిన సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం 2021లో నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 51 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించాలని అప్పట్లో భావించింది. అప్పటికి భూముల రీసర్వే పూర్తయిన 51గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఒక్కో సచివాలయం పరిధిలో ఇద్దరు సిబ్బందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై శిక్షణ కూడా ఇప్పించారు. ఆయా సచివాలయాలకు అవసరమైన సాంకేతిక పరికరాలు సమకూర్చారు. ఆయా గ్రామాల పరిధిలోని రిజిస్ట్రేషన్లనీ సచివాలయాల్లోనే జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటిలో చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలం ఉన్నవ పంచాయతి పరిధిలోని మర్రిపాలెం గ్రామం కూడా ఉంది. 2021 అక్టోబర్ 2వ తేదిన రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని భావించినా సాధ్యం కాలేదు. 2022లో కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. కానీ మర్రిపాలెం గ్రామంలో మాత్రం రిజిస్ట్రేషన్ సేవలు మొదలు కాలేదు.
ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బంది బదిలీపై వేరేచోటికి వెళ్లిపోవటమే దీనికి కారణం. ఆ తర్వాత రాష్ట్రంలోని దాదాపు 2వేల సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు మొదలుపెట్టాలని ప్రభుత్వం భావించింది. 2022 అక్టోబర్ 2నుంచి విడతల వారీగా ఈ ప్రక్రియ మొదలైంది. మర్రిపాలెంలో మాత్రం పరిస్థితి అలాగే ఉండిపోయింది. గ్రామంలో వివిధ రకాల రిజిస్ట్రేషన్ సేవల కోసం వెళ్తే సిబ్బంది లేరనే సమాధానం వస్తోంది. సరేనని సమీపంలోని ప్రత్తిపాడు లేదా గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తే అక్కడా చేయటం లేదు. మర్రిపాలెం గ్రామం పైలెట్ ప్రాజెక్టు జాబితాలో ఉన్నందున అక్కడి రిజిస్ట్రేషన్లు వేరే చోట చేయటం సాధ్యం కాదనే సమాధానం వస్తోంది. దీంతో మర్రిపాలెం గ్రామస్థుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది.
సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఆస్తులకు లకు సంబంధించిన డాక్యుమెంట్లు స్కాన్ చేసి వారి పరిధిలోని సబ్ రిజిస్ట్రార్లకు పంపించాల్సి ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ వాటిని తనిఖీ చేసి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అప్పట్లో ఆదేశించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారం, యడ్లపాడు మండలం ఉన్నవ పంచాయితి పరిధిలో మర్రిపాలెం గ్రామం, వేమూరు మండలం పులిచింతల పాలెం, ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం పరిధిలోని కొండ జాగర్లమూడి, దాచేపల్లి మండలం అలుగుమిల్లిపాడు సచివాలయాలను అప్పట్లో పైలెట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. వీటిలో కేవలం అలుగుమిల్లిపాడు సచివాలయంలో మాత్రమే అడపా, దడపా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మిగతాచోట్ల రిజిస్ట్రేషన్లు జరగటం లేదు. రిజిస్ట్రేషన్లు జరగకపోవటం సంబంధిత గ్రామాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.
పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైనప్పటి నుంచి మర్రిపాలెం గ్రామంలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఇల్లు, పొలాలు కొన్నవారు రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సచివాలయంలో రిజిస్ట్రేషన్ కాక... రిజిస్ట్రార్ కార్యాలయంలో పని జరగక ఇబ్బందులు పడుతున్నారు. లక్షల రూపాయలు పెట్టి కొన్న ఆస్థి తమ పేరిట రిజిస్ట్రర్ చేయించుకోవటం కుదరక ఆందోళన చెందుతున్నారు. పైగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు తరచుగా పెరుగుతుంటాయి. తాము ఏడాది క్రితం కొన్న వాటికి ఇప్పుడు చేయించుకోవాలన్నా ప్రస్తుత ధరల ప్రకారం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమస్యపై గ్రామ సచివాలయంలో సిబ్బంది సమాధానం చెప్పలేకపోతున్నారు. జిల్లాస్థాయి అధికారుల్ని కలిసి సమస్య వివరించినా పరిష్కారంపై మాత్రం వారు దృష్టి సారించలేదు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పుడు రాష్ట్రంలోని చాలాచోట్ల జరుగుతోంది. కానీ మొదట్లో పైలెట్‌గా ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రం సమస్య ఎదురవుతోంది. వాళ్లు వేరేచోట కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి వీల్లేకపోవటం మరింత ఇబ్బందిగా మారింది.