నేటి సాయంత్రం నుంచి భారీ, అతి భారీ వర్షాలు
గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు అప్రమత్తతపై ప్రధాని మోదీ సమీక్ష కలెక్టర్లతో మాట్లాడిన సీఎం జగన్ శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో. జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
ఈనాడు, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఉత్తరాంధ్ర దిశగా కదులుతోంది. శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుండంగా.. అనంతరం తుపానుగా బలపడనుంది. దీంతో సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. విద్యుత్తు స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సూచించాయి. 5వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి రావాలని కోరాయి. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులతో విడివిడిగా సమీక్షించారు. ‘అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం.. గురువారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. సాయంత్రానికి ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,020 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. శుక్రవారం (3వ తేదీ) నాటికి తుపాను (జవాద్‌గా పిలుస్తున్నారు) గా మారి.. వాయవ్య దిశగా ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించనుంది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా- దక్షిణ ఒడిశా తీరానికి చేరుతుంది. అక్కడ నుంచి ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంద’ని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. తుపాను ప్రభావం ఉండే జిల్లాలకు విపత్తు ప్రతిస్పందన దళాలను తరలించినట్లు కమిషనర్ కన్నబాబు తెలిపారు.
ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు: సీఎం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి సహాయ శిబిరాలు ఏర్పాటుచేయాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తుపాను సన్నద్ధతపై గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. లోతట్టు, ముంపు ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తుపాను కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. తుపాను పరిస్థితిని సమీక్షించేందుకు ముగ్గురు సీనియర్ అధికారులను ప్రభుత్వం నియమించింది. శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతీలాల్‌దండే, విశాఖపట్నానికి శ్యామలరావును నియమించారు. వీరు వెంటనే ఆయా జిల్లాలకు వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.
* ప్రభుత్వ సిబ్బందికి జిల్లాల కలెక్టర్లు సెలవులు రద్దుచేశారు. నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విజయనగరం జిల్లాలో శుక్ర, శనివారాల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ సూర్యకుమారి ప్రకటించారు. తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒకరోజు సెలవు ఇస్తున్నట్లు తూర్పు గోదావరి కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోనూ ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సెలవులు ప్రకటించారు. ఈ నెల 3 నుంచి 5 వరకు విశాఖపట్నంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ఆ జిల్లా అధికారులు వెల్లడించారు. శుక్రవారం బయలుదేరే పలు రైళ్లను ద.మ.రైల్వే రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.