అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా యంగ్ డైనమైట్ శుభ్‌మన్ గిల్ (63 బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గిల్ ఈ మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో పొట్టి ఫార్మాట్‌లో తన తొట్టతొలి సెంచరీ నమోదు చేశాడు.
గిల్ 187.04 స్ట్రయిక్ రేట్‌తో శతక్కొట్టాడంటే, అతని విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందో ఇట్టే అర్ధమవుతోంది. సెంచరీ చేశాక కూడా ఏమాత్రం తగ్గని గిల్.. సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సెంచరీ సాధించిన అనంతరం గిల్ ప్రేక్షకుల వైపు తలవంచి అభివాదం చేశాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీతో పాటు మరో సెంచరీ కూడా బాదిన గిల్.. టీ20ల్లోనూ శతకాల పరంపరను కొనసాగించాడు.
గిల్ విధ్వంసకర శతకానికి రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు కూడా తోడవ్వడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ (1) ఒక్కడే నిరుత్సాహపరిచాడు. కివీస్ బౌలర్లలో బ్రేస్‌వెల్, టిక్నర్, సోధీ, డారిల్ మిచెల్ తలో వికెట్ పడగొట్టారు.