దక్షిణాఫ్రికా కరోనా కొత్త వేరియంట్... ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. మరో ఉద్ధృతికి దారి తీయొచ్చన్న ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్, బెల్జియంలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ కూడా ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రజల్లో వణుకు పుడుతోంది. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ప్రమాదకరి కావచ్చని వేగంగా వ్యాప్తించి, తీవ్ర లక్షణాలకు దారి తీయవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సౌత్ ఆఫ్రికాలో రోజూ 200 మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతో విదేశీ ప్రయాణికులపై ఇజ్రాయెల్ ఆంక్షలు విధించింది. బ్రిటన్‌లో బి.1.1.529 వేరియంట్ నమోదు కాకపోయినా దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా నుంచి రాకపోకలపై నిషేధం ప్రకటించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్, జపాన్‌లు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాయి. దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి వచ్చేవారిపై ప్రయాణ ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అంగీకారం తెలిపాయి. కొత్త వేరియంట్‌కు సంబంధించి భారత్‌లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. అయితే ముందు జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ఇక కొత్త వేరియంట్‌కు తీవ్రంగా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని ఆందోళనకర వేరియంట్‌గా వర్గీకరించి, ఒమిక్రాన్ అని పేరు పెట్టింది.