ANWtv నేటి 10 ముక్యంసలు

1. ‘సినిమా బిడ్డలం’ ప్యానెల్‌ రాజీనామా!

సిని‘మా’ బిడ్డలం ప్యానెల్‌ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని ఆరోపించారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్‌ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు.

2. TS: 70 శాతం సిలబస్‌తో ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలు

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. 70 శాతం సిలబస్‌ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు పెంచామన్నారు. నమూనా ప్రశ్నా పత్రాలు, పరీక్షల మెటీరియల్‌ను tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు జలీల్‌ తెలిపారు. 

3. కరెంట్‌ కోతలు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తోందన్న కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న ‘కేటాయించని విద్యుత్‌’ను వాడుకోవాలని తెలిపింది. మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు ‘కరెంట్‌’ సాయం చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

4. జగతి పబ్లికేషన్స్‌ ఈడీ కేసులో నా పేరు తొలగించండి: జగన్‌

జగతి పబ్లికేషన్స్‌పై ఈడీ ఛార్జ్‌షీట్‌లో ఏపీ సీఎం జగన్‌పై మనీలాండరింగ్‌ అభియోగాలు లేవని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. జగతి పబ్లికేషన్స్‌ ఈడీ కేసులో జగన్‌ పేరు తొలగించాలని కోర్టును కోరారు. జగన్‌ డిశ్ఛార్జి పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు కొనసాగించేందుకు జగన్‌ డిశ్ఛార్జి పిటిషన్‌పై విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది. 

5. అలాంటి వారిని నడిరోడ్డుపై కాల్చిపారేయాలి: నల్లపురెడ్డి

మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేసే చట్టాలు రావాలని వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అప్పుడే మృగాళ్లలో భయం ఏర్పడుతుందన్నారు.  నెల్లూరుజిల్లా ఇందుకూరిపేట మండలంలో జరిగిన ఆసరా పథకం రెండోవిడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.  దేశంలో మహిళలపై అఘాయిత్యాలు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

6. మోదీ సలహాదారుగా అమిత్‌ ఖారే నియామకం

ప్రధాని నరేంద్ర మోదీకి సలహాదారుగా మాజీ ఐఏఎస్‌ అధికారి అమిత్‌ ఖారే నియమితులయ్యారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన గత నెలలో పదవీ విరమణ పొందారు. రెండేళ్ల పాటు కాంట్రాక్టు బేసిస్‌లో ఆయన పీఎంవోలో ప్రధాని సలహాదారుగా కొనసాగుతారని సిబ్బంది, వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. పీఎంవోలో ప్రధానికి సలహాదారుగా ఆయన నియామకాన్ని కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది.  

7. లఖింపుర్‌ ఘటన.. రేపు రాష్ట్రపతిని కలవనున్న రాహుల్‌, ప్రియాంక

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రేపు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సభ్యుల బృందం బుధవారం రాష్ట్రపతిని కలిసి లఖింపుర్‌ ఘటనపై వాస్తవాలతో కూడిన నివేదికను అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు 11.30 గంటలకు వీరు రాష్ట్రపతిని కలవనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

8. రష్యాలో కరోనా మరణమృదంగం

కరోనా మహమ్మారి రష్యాను మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత కొంత కాలంగా అక్కడ నమోదవుతున్న మరణాలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 973మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పట్నుంచి ఒక్కరోజులో ఇంత భారీగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.  

9. చైనాలో వర్ష బీభత్సం!

చైనాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఆ దేశానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు 15 మంది మృతి చెందగా.. ముగ్గురు గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు. వరద ముంపు నేపథ్యంలో ఆ ప్రావిన్స్‌లోని దాదాపు 1.20లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు పేర్కొన్నారు. వర్షాల కారణంగా చైనాకు 780 మిలియన్‌ డాలర్ల మేర ప్రత్యక్షంగా ఆర్థికనష్టం వాటిల్లినట్టు చైనా అధికార మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది. 

10. ఆ రెండు పదాలు ఒత్తిడి పెంచాయి: విరాట్‌ కోహ్లి

క్వాలిఫైయర్స్‌, ఎలిమినేటర్స్ అనే రెండు పదాలు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రదర్శనపై తీవ్ర ఒత్తిడిని పెంచాయని ఆ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఆ రెండు మ్యాచుల్లో విజయం సాధించి ఉంటే ఫైనల్‌కి చేరే వాళ్లమని కోహ్లి ఆశాభావం వ్యక్తం చేశాడు. సోమవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ చేతిలో బెంగళూరు జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో బెంగళూరు లీగ్ నుంచి నిష్క్రమించింది.  

Post a Comment

أحدث أقدم