ప్రకటించినవి కొన్ని.. ప్రకటించాల్సినవి మరెన్నో
హైదరాబాద్: ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ ఖ్యాతి నలుదిశలకు వ్యాప్తి చెందింది. దీంతో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు అగ్రకథానాయకులు సైతం తమ చిత్రాలను పాన్‌ఇండియన్ స్థాయిలో రూపొందించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ నటీమణులు టాలీవుడ్‌వైపు మొగ్గు చూపిస్తున్నారు. అలా తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌లో బీటౌన్ సీనియర్ నటీమణులతోపాటు కుర్ర హీరోయిన్స్ కూడా ‘కీ’లక పాత్రలు సొంతం చేసుకున్నారు. వాటిల్లో కొన్ని అధికారికంగా ప్రకటించగా.. మరికొన్ని మాత్రం ఇంకా ఊహాగానాల దశలోనే ఉన్నాయి. ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి? ఆ బీటౌన్ లేడీస్ ఎవరు? ఓసారి మీరూ చూసేయండి..!
అప్పట్లో సతీమణిగా.. ఇప్పుడు అక్కగా..!
‘ది దర్టీ పిక్చర్’, ‘శకుంతలా దేవి’.. ఇలా ఎన్నో విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న బాలీవుడ్ నటి విద్యాబాలన్. దాదాపు రెండేళ్ల క్రితం ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ చిత్రాల్లో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో కనిపించిన ఈ నటి తెలుగువారికి ఎంతో దగ్గరయ్యారు. కాగా, త్వరలో ఆమె సూపర్‌స్టార్ సోదరిగా తెలుగుతెరపై మరోసారి సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సర్కారువారి పాట’లో మహేశ్ అక్కగా విద్యాబాలన్ నటించనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
పవర్‌ఫుల్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్..!
పవర్‌ఫుల్ రోల్స్‌కు బీటౌన్‌లో కేరాఫ్ అడ్రస్ ఎవరు? అని అడిగితే వెంటనే గుర్తుకువచ్చే పేరు దీపికా పదుకొణె. పలు హిందీ చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకులనూ అలరించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో డైరెక్ట్ తెలుగు సినిమాతో మెప్పించనున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో పట్టాలెక్కనున్న ఓ పాన్ ఇండియన్ చిత్రంలో దీపిక కథానాయికగా ఎంపికయ్యారు. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇందులో దీపిక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం.
రామ చక్కని సీతగా..!
‘1 నేనొక్కడినే’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు కృతిసనన్. ఆ తర్వాత ఆమె తెలుగులో నటించినా ఇక్కడ అనుకున్నా స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌కు వెళ్లి.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలోనే దాదాపు ఆరేళ్ల తర్వాత కృతిసనన్ తెలుగుతెరపై కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఓంరౌత్ డైరెక్షన్‌లో రాముడిగా ప్రభాస్ కనిపించనున్న ‘ఆదిపురుష్’లో కృతిసనన్ సీతగా స్థానం దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్.
మరోసారి అమ్మగా..!
‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో బాలకృష్ణకు తల్లి పాత్రలో మెప్పించిన హేమమాలిని మరోసారి తెలుగు తెరపై కనిపించనున్నట్లు సమాచారం. ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ కాంబోలో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’లో హేమమాలిని కీలకపాత్రను సొంతం చేసుకున్నట్లు సమాచారం. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. రాముడి తల్లి కౌసల్యగా హేమ కనిపించనున్నారంటూ ప్రచారం సాగుతోంది.
అలనాటి సెన్సేషనల్ నటి..!
‘మైనే ప్యార్ కియా’తో ఒకప్పుడు దేశవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న నటి భాగ్యశ్రీ. కొన్నేళ్ల విరామం తర్వాత ఇటీవల వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’లో ఆమె ఓ కీ రోల్ సొంతం చేసుకున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వింటేజ్ ప్రేమకథా చిత్రంలో భాగ్యశ్రీ పాత్ర ఎంతో కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
శ్రీలంక బ్యూటీ కూడా వచ్చేస్తోంది..!
శ్రీలంక నుంచి వచ్చి బాలీవుడ్‌లో తన సత్తా చాటుకుంటోన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఇటీవల ‘సాహో’లో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించిన ఈ నటి త్వరలో పవర్‌స్టార్ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్‌కల్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తోన్న తరుణంలో జాక్వెలిన్ సైతం రెండో కథానాయికగా కనిపించనున్నారంటూ ప్రచారం సాగుతోంది.
వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గని’లో హీరోయిన్‌గా ఆఫర్ దక్కించుకున్నారు నటి సయీ మంజ్రేకర్. ‘గని’ విడుదల కాకముందే ఈ ముద్దుగుమ్మ మరో బంపర్ ఆఫర్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్-కొరటాల శివ కాంబోలో రానున్న చిత్రంలో సయీ కథానాయికగా కనిపించనున్నారంటూ నెట్టింట్లో టాక్.
ల్యాండైన మరో బ్యూటీ..!
తారక్-త్రివిక్రమ్ కాంబోలో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. #NTR30గా పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి వరీన హుస్సేన్ అవకాశం దక్కించుకున్నారట. ఈ మేరకు ఇప్పటికే ఆమె లుక్ టెస్ట్‌లో సైతం పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఓ సినిమాలో వరీన స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీళ్లు మాత్రమే కాకుండా మరికొంత మంది బాలీవుడ్ నటీమణులు టాలీవుడ్‌లో తెరకెక్కనున్న సినిమాలో కీలకపాత్ర షోషిస్తున్నట్లు తెలుస్తోంది.