స్నేహితుడినే మట్టుబెట్టాడు


డబ్బు కోసం ఘాట్‌రోడ్లో ఘాతుకం రక్తపు మడుగుల్లో పడి ఉన్న మృతదేహం..

మాడుగుల పట్టణం, న్యూస్‌టుడే: ఘాట్‌రోడ్డులో ఓ యువకుడి హత్య కలకలం రేపింది. డబ్బు కోసం స్నేహితుడే అతడిని హతమార్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. సీఐ సయ్యద్‌ ఇలియాస్‌ మహమ్మద్‌, ఎస్సై పి.రామారావు, గ్రామస్థుల కథనం ప్రకారం.. జంపెన గ్రామానికి చెందిన తాటికొండ స్వామినాయుడు(25) మృతదేహం ఘాట్‌రోడ్డులోని ఓ వాటర్‌ ప్లాంట్‌పై పడి ఉందని ఆదివారం అర్ధరాత్రి అతని అక్క ఉమ, బావ మజ్జి శ్రీనివాస్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి అనుమానితుడైన అదే గ్రామానికి చెందిన పెచ్చేటి ఉపేంద్ర అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు స్వామినాయుడితో కలిసి ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. స్నేహితుడి వద్ద రూ.18 లక్షలు ఉండటాన్ని గమనించిన ఉపేంద్ర ఎలాగైనా ఆ సొమ్మును కాజేయాలనుకున్నాడు. శనివారం రాత్రి పాడుబడిన వాటర్‌ ప్లాంట్‌ వద్ద స్వామినాయుడికి ఎక్కువగా మద్యం తాగించి అతడి తలపై ఉపేంద్ర కత్తితో దాడి చేసి చంపేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించి.. రూ.18 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. స్వామినాయుడికి తల్లి, ముగ్గురు అక్కలు ఉన్నారు. అందివచ్చిన కుమారుడు మృతిచెందడంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు.

Post a Comment

أحدث أقدم