బోరబండలో అస్థిపంజరం కేసును ఛేదించిన పోలీసులు
అమీర్‌పేట, న్యూస్‌టుడే: ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలోని బోరబండ ఇందిరానగర్ ఫేజ్-2లో ఓ దేవాలయం గదిలో బయటపడిన అస్థిపంజరం కేసును పోలీసులు ఛేదించారు. కోల్‌కతాకు చెందిన పలాష్ పాల్(43) కార్పెంటర్. 2009లో నగరానికి వచ్చాడు. మొదటి భార్య మరణించగా రెండో వివాహం చేసుకున్నాడు. అదే రాష్ట్రం మిడ్నాపూర్‌కు చెందిన ప్లంబర్ కాంట్రాక్టర్ కమల్ మైతీ(50) తన కుటుంబంతో కలిసి రాజీవ్‌గాంధీనగర్‌లో నివసిస్తున్నాడు. ఇద్దరు స్నేహితులయ్యారు. ఈ క్రమంలో కమల్ భార్యపై పలాష్ కన్నేశాడు. విషయం తెలిసిన కమల్.. అతన్ని మందలించాడు. దీంతో కక్ష పెంచుకుని సమయం కోసం ఎదురుచూడసాగాడు. కమల్‌ను జనవరి 10న ఇందిరానగర్ ఫేజ్-2లోని గోదాంకు రప్పించిన పలాష్.. కర్రతో తలపై కొట్టి హత్య చేశాడు. మృతదేహాన్ని చెక్కపెట్టెలో పెట్టి తాళం వేసి పరారయ్యాడు. దేవస్థాన నిర్వాహకులు దుకాణాన్ని ఖాళీ చేయిస్తుండగా.. ఈ వ్యవహారం బయటపడిన విషయం విదితమే.