ఏదైనా అనుకోని పరిస్థితుల్లో అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు వెంటనే గుర్తొచ్చేది వ్యక్తిగత రుణం. అది సులభంగా కూడా లభిస్తుంది. అదేవిధంగా బంగారంపై రుణాలు కూడా ఇందుకు ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇవి భద్రతతో కూడుకొని ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బంగారం తనఖా పెట్టి రుణం తీసుకుంటే మంచిదా? లేదా వ్యక్తిగత రుణం తీసుకుంటే మంచిదా? అనే సందేహం కలుగుతుంటుంది మనకు. ఈ రెండు రుణాలు వేగంగానే లభ్యమవ్వడం వడ్డీ రేట్లు కూడా ఇంచుమించు ఒకే పరిధిలో ఉండటం మూలంగా చాలా మంది వినియోగదార్లు సందిగ్ధంలో పడతారు. గోల్డ్ లోన్ పై వడ్డీరేటు 9.85% - 26%, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు 10.75 - 24% వరకూ ఉంటుంది.
పరిమాణం పరంగా:
రుణం మొత్తం పరంగా అయితే వ్యక్తిగత రుణం కంటే బంగారు రుణాలకు ఎక్కువ పరిమితి ఉంటంది. వ్యక్తిగత రుణాలు రూ.40 లక్షల వరకూ ఉంటే బంగారం తనఖా పై రుణం సుమారు రూ.1.5 కోట్ల వరకూ ఉంటుంది. ఎక్కువ మొత్తంలో రుణం అత్యవసరంగా కావాలంటే గోల్డ్‌లోన్ తీసుకోవచ్చు. బంగారంపై రుణం కనీస మొత్తం రూ.1,000 ఉంటుంది. వ్యక్తిగత రుణాల్లో అయితే కనీస మొత్తం రూ.5,000 నుంచి ఉంటుంది.
క్రెడిట్ స్కోరు ప్రభావం:
బంగారం తనఖా ద్వారా పొందే రుణాలకు క్రెడిట్ స్కోరు సంబంధించి కొంత వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే రుణం తీసుకునేవారు దానికి సరిపోయే బంగారం బ్యాంకు లేదా రుణమిచ్చే సంస్థల వద్ద ఉంచుతారు. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే వ్యక్తిగత రుణం లభించడం కష్టం ఆ సమయంలో గోల్డ్ లోన్ ఎంచుకోవడం మంచిది. అయితే ఎక్కువ మొత్తంలో రుణం అయితే గోల్డ్ లోన్ ఇచ్చేటపుడు కూడా క్రెడిట్ స్కోరును పరిగణలోకి తీసుకుంటారు.
వ్యక్తిగత రుణం పొందాలంటే ప్రధానంగా చూసేది ఆ వ్యక్తి చెల్లింపు సామర్థ్యం. రుణం మొత్తం, వడ్డీరేటు, కాలపరిమితి తదితర అంశాలన్నీ క్రెడిట్ స్కోరు ఆధారంగా ఉంటాయి. రుణం తీసుకునే వ్యక్తి స్కోరు తక్కువగా ఉంటే రుణం తిరస్కరించవచ్చు లేదా ఎక్కువ వడ్డీరేటు కు ఇవ్వొచ్చు కాబట్టి క్రెడిట్ స్కోరు తక్కువుంటే వ్యక్తి గత రుణం కంటే బంగారు రుణం తీసుకోవడం మంచిది.
డాక్యుమెంటేషన్:
సాధారణంగా వ్యక్తిగత రుణాలు సెక్యూర్డ్ కాదు కాబట్టి వాటికి డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ వంటివి ఉంటాయి. బంగారు రుణాలపై చాలా తక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది. చాలా సంస్థలు గుర్తింపు, చిరునామా పత్రాల ఆధారంగా రుణం జారీ చేస్తారు. రుణ సంస్థలకు తనఖాగా బంగారం ఉంటుంది కాబట్టి వ్యక్తిగత రుణాలలో ఎక్కువ డాక్యుమెంటేషన్ కొంచెం వివరంగా ఉంటుంది. అడ్రసు, గుర్తింపు పత్రాలు, ఆదాయ పత్రాలు బ్యాంకు స్టేట్ మెంట్ తదితర పత్రాలన్నీ అందించాల్సి ఉంటుంది.
చెల్లించేందుకు ఆప్షన్లు:
బంగారు రుణాల్లో తిరిగి చెల్లించేందుకు వివిధ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వడ్డీ మొత్తం ముందుగా చెల్లించడం లేదా నెలవారీ చెల్లించడం, అసలు చివరలో చెల్లించడం, లంప్‌సమ్ గా కొంత చెల్లించడం మొదలైన ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగత రుణాల్లో అయితే చాలా వరకూ రుణం తీసుకున్న వ్యక్తి ఈఎమ్ఐ ల పద్ధతిలో రుణం క్రమంగా చెల్లించాలి.
ఎక్కవ కాలపరిమితి:
రుణం తీర్చేందుకు ఉండే వ్యవధి బంగారు రుణాల కంటే వ్యక్తిగత రుణాలకు ఎక్కువగా ఉంటుంది. బంగారు రుణాల పై గరిష్టం 3 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది. వ్యక్తి గత రుణాల్లో ఐదేళ్లు వరకూ ఉంటుంది. కొన్ని బ్యాంకులైతే 7 సంవత్సరాలు కూడా ఇస్తుంటాయి. రుణం తీర్చేందుకు గడువు ఎక్కువ కావాలనుకుంటే వ్యక్తిగత రుణం తీసుకోవడం మంచిది. నెల వారీ ఈఎమ్ఐ తక్కువగా ఉంటుంది కానీ రుణం కాలవ్యవధి పెరుగుతుంది.
సౌకర్యాలు:
బంగారం రుణం తీసుకునేందుకు వ్యక్తి బ్యాంకుకు లేదా రుణ సంస్థలకు వెళ్లాలి. వ్యక్తిగత రుణాల్లో ప్రస్తుతం వ్యక్తి సంస్థ వద్దకు వెళ్లకుండా పని జరిగిపోతుంది. ఫైనాన్స్ సంబంధించిన మార్కెట్ ప్లేస్‌లు ఎక్కువగా ఉండటం వినియోగదార్లు ఆన్‌లైన్ లోనే ఎక్కడ రుణం తక్కువ రేటుకు లభిస్తుందో తెలుసుకోవచ్చు.
బంగారం పై రుణం తీసుకోవాలా? వ‌్యక్తిగత రుణం తీసుకోవాలా? వినియోగదార్లు తమ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. తక్కువ క్రెడిట్ స్కోరు ఉండి, ఎక్కువ మొత్తంలో రుణం అవసరం అనుకుంటే తిరిగి చెల్లించే వెసులుబాటు, స్వల్పకాలం నిమిత్తం రుణం తీసుకోవాలనుకుంటే బంగారు రుణం తీసుకోవడం మంచిది. మంచి క్రెడిట్ స్కోరు కలిగి, స్థిరమైన ఆదాయం ఉండి, రుణ చెల్లించే కాలపరిమితి ఎక్కువ కావాలనుకుంటే వ్యక్తిగత రుణాలను తీసుకోవడం మంచిది