కొవిడ్-19 వ్యాధి నిరోధానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ తయారు చేసిన ‘కొవాగ్జిన్’ టీకా పూర్తిగా సురక్షితమని, ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావులేదని ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. ఇప్పటికే 16 వైరస్ టీకాలను ఆవిష్కరించి ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. వివిధ అంశాలపై ఆయన ఏమన్నారంటే.. ప్రయోగాలు పూర్తికాకుండా కొవాగ్జిన్‌కు అనుమతి ఎందుకు ఇచ్చారని కొందరు అడుగుతున్నారు. 2019లో రూపొందించిన నిబంధనల ప్రకారం మనదేశంలో అత్యవసర పరిస్థితుల్లో మొదటి-రెండో దశ ప్రయోగాల ఆధారంగా టీకాలు, మందులకు అనుమతి ఇవ్వొచ్చు.
2. రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించిన సీఎం
రామతీర్థం ఘటనపై సీఎం జగన్ సీఐడీ విచారణకు ఆదేశించారని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై ఇప్పటికే అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారని, ఒకటి, రెండు రోజుల్లో బాధ్యులను సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తారని చెప్పారు. రాష్ట్రంలోని ఆలయాల భద్రతపై దేవాదాయశాఖ మంత్రి, ఆ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, ప్రత్యేక కమిషనరు అర్జునరావు, లాఅండ్‌ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తదితరులు దేవాదాయశాఖ కమిషనరు కార్యాలయంలో సోమవారం సమావేశయ్యారు.
3. ఇంజినీరింగ్ ఆవిష్కరణలకు క్రెడిట్లు ఇవ్వండి
బీటెక్‌లో విద్యార్థులు చేసే ఆవిష్కరణలకు కొన్ని క్రెడిట్లు ఇస్తే బాగుంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విద్యాశాఖకు సూచించారు. అప్పుడు సమయం వృథా కాదన్న భావన ఉండి విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచిస్తారని చెప్పారు. రాష్ట్ర ఐటీ శాఖ, యూనిసెఫ్, విద్యాశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో పాల్గొని విజేతలైన పాఠశాలల విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీటెక్ మూడో ఏడాదిలోనే ప్రాక్టీస్ స్కూల్ లేదా ఇంటర్న్‌షిప్...పేరు ఏదైనా పెట్టి శిక్షణ ఇస్తే నాణ్యమైన ఉద్యోగులు వస్తారని చెప్పారు.
4. హైకోర్టు ప్రతిష్ఠను పెంచేలా పనిచేశా
సహచర న్యాయమూర్తులు, సిబ్బంది సహకారంతో ఏపీ హైకోర్టు ప్రతిష్ఠను మరింత పెంచే రీతిలో తనవంతు ప్రయత్నం చేశానని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా పనిచేయడం చాలా సంతోషానిచ్చిందన్నారు. సిక్కిం హైకోర్టు సీజేగా బదిలీపై వెళుతున్న జస్టిస్ జేకే మహేశ్వరికి హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది సోమవారం సాయంత్రం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ జేకే మహేశ్వరి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
5. తొలి డోసు ఎక్కడ తీసుకుంటే.. రెండోదీ అక్కడే
కొవిడ్ టీకా తొలి డోసు ఏ కేంద్రంలో పొందితే.. రెండోదీ అక్కడి నుంచే తీసుకోవాలని ప్రజారోగ్య సంచాలకులు, రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టంచేశారు. కొవిన్ యాప్‌లో సొంతంగా నమోదు చేసుకున్నా.. వైద్యసిబ్బంది సహకారంతో తమ సమాచారాన్ని పొందుపరిచినా.. ఏ ప్రదేశం నుంచి టీకాను వేయించుకోవాలనుకుంటున్నారో.. ఆ స్వేచ్ఛ లబ్ధిదారుడికి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ గుర్తింపు కార్డులో చిరునామా ఒకటి ఉండి.. ప్రస్తుత నివాస చిరునామా మరొకటి ఉన్నా కూడా.. సమాచారం పొందుపర్చేటప్పుడు ఏ ప్రదేశాన్ని ఎంపిక చేస్తే.. అదే ప్రదేశం యాప్‌లో ఉంటుందన్నారు.
6. ఫోర్డ్ 2021 ఎకోస్పోర్ట్ ప్రారంభ ధర రూ.7.99 లక్షలు
ఫోర్డ్ ఇండియా కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ ఎకోస్పోర్ట్‌లో 2021 వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. ఈ వాహనాల ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబయి). కొత్త ఎస్‌యూవీ అయిదు వేరియంట్లు - యాంబియెంట్, టైటానియం, టైటానియం ప్లస్, ట్రెండ్, స్పోర్ట్స్‌లలో లభించనుంది. బీఎస్-6 పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో ఇది లభిస్తుంది. పెట్రోల్ విభాగం ధరల శ్రేణి రూ.7.99- 10.99 లక్షలు, డీజిల్ వేరియంట్‌ల ధర రూ.8.69- 11.49 లక్షలుగా నిర్ణయించారు. టైటానియం వేరియంట్‌లో సన్‌రూఫ్, కొత్త అధుసంధానత, పొడిగించిన వారెంటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
7. తెలంగాణలో మరపురాని జ్ఞాపకాలు
తెలంగాణ హైకోర్టులో తనకు మరపురాని జ్ఞాపకాలెన్నో మిగిలాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చిన తనను ఆ తర్వాత తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించిన కొలీజియానికి, ఇక్కడ ప్రతి అడుగులోనూ సహకరించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాఖండ్‌కు బదిలీపై వెళుతున్న జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్‌కు సోమవారం హైదరాబాద్‌లో ఫుల్‌కోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహచర న్యాయమూర్తులు, న్యాయవాదుల నుంచి తనకు గొప్ప సహకారం అందిందన్నారు.
8. అసాంజే అప్పగింతకు బ్రిటన్ కోర్టు తిరస్కరణ
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను గూఢచర్యం కేసులో విచారణ నిమిత్తం తమ దేశం రప్పించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. ఆయన్ను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్‌లోని జిల్లా న్యాయమూర్తి వనెస్సా బరైట్సర్ తిరస్కరించారు. అస్సాంజే మానసిక ఆరోగ్యం దృష్ట్యా అది క్రూరత్వం కిందకు వస్తుందంటూ అభిఫ్రాయపడ్డారు. అమెరికాకు అప్పగిస్తే ఆయన ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు. పదేళ్ల క్రితం అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించి వికీలీక్స్ సంస్థ బయటపెట్టిన రహస్యాలు సంచలనం సృష్టించాయి.
9. అకాల వర్షాల నుంచి రక్షణ..
కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న రైతులు అకాల వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతుండడంతో ‘దిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ కమిటీ’ మరిన్ని ఏర్పాట్లు చేస్తోంది. శిబిరాల్లోకి వర్షపునీరు ప్రవేశించినా సమస్య లేకుండా కాస్త ఎత్తైన పడకలను రైతుల కోసం సమకూరుస్తోంది. ప్రధాన వేదికకు సమీపంలో లోతట్టు ప్రాంతాల్లో గుడారాలు ఉండడంతో ఈ మేరకు అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. సింఘు, టిక్రి, గాజీపుర్‌లలో 1200 వరకు ఎత్తైన పడకలను సమకూర్చింది. విద్యాసంస్థల కోసం వాడే బస్సుల్లో సీట్ల స్థానంలో పడకల సదుపాయం కల్పించి, వాటిని దీక్షా స్థలాల వద్దకు పంపించాలని గురుద్వారా కమిటీ నిర్ణయించింది.
10. రోహిత్‌ను అడ్డుకొంటాం!
ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకరని ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నేథన్ లైయన్ అన్నాడు. అతడి రాక ప్రత్యర్థి బౌలర్లకు సవాలేనని పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్ సవాల్‌కు తాము సిద్ధమేనని వెల్లడించాడు. బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు పక్కా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ లక్ష్యం మాత్రం మూడో టెస్టు గెలవడమేనని తెలిపాడు. ‘అత్యుత్తమ ఆటగాడైన రోహిత్ శర్మ బౌలర్లకు సవాల్‌గా నిలుస్తాడు. మేం ఆ సవాల్‌కు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు.