తొమ్మిది హత్యలు.. ఆరు ఎదురుకాల్పులు

విశాఖపట్నం, సీలేరు, న్యూస్‌టుడే: ఇది మావోయిస్టు సీతక్క ప్రస్థానం లొంగుబాటుతో ముగిసిన పదేళ్ల అజ్ఞాతవాసం చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీ నాయకుల ప్రసంగాలు...విప్లవ గీతాలకు ఆమె ఆకర్షితురాలైంది..దశాబ్ద కాలం క్రితం ఆ పార్టీలోకి చేరిపోయింది.. అంచెలంచెలుగా కటాఫ్‌ ఏరియాలో కీలక నాయకురాలిగా ఎదిగింది..పాతికేళ్ల వయసులోనే అనారోగ్యంతో పోలీసులకు లొంగిపోయింది.. ఆమే సీతక్క సీత అలియాస్‌ స్వర్ణ అలియాస్‌ శైలు..పదేళ్ల అజ్ఞాతవాసం ముగించుకుని సోమవారం జనజీవనంలో కాలూనింది.. ఆమె ప్రస్థానంలో ఎన్నో కీలక ఘట్టాలున్నాయి..

పెదబయలు మండలానికి చెందిన సీతక్క మావోయిస్టు ఉద్యమంలోకి 2010లో సాధారణ మిలీషియా సభ్యురాలిగా చేరింది. గాలికొండ, పెదబయలు, కోరుకొండ, కటాఫ్‌ ఏరియా కమిటీల్లో వివిధ హోదాల్లో పనిచేసింది. లువ్వాసింగి, సిర్లిమెట్ట, గున్నమామిడి, చింతలూరు, కొత్తవూరు గ్రామాలతో పాటు ఒడిశాలోని బెజ్జంగి, గజ్జెడుల వద్ద జరిగిన ఎదురుకాల్పులలో పాల్గొంది. 2017లో పెదబయలు మండలం జక్కం గ్రామం వద్ద పోలీసులపై మందుపాతరను పేల్చిన ఘటనలో పాల్గొంది. ఈమెపై రూ. నాలుగు లక్షలు రివార్డు ఉంది. సీతక్కతో బాటు పాంగి ముసిరి అలియాస్‌ చిట్టిబాబు, కొర్రా వెంకటరావు, ఆర్మ్‌డ్‌ మిలీషియా సభ్యుడు పాంగి గోపాలరావు కూడా విశాఖ డీఐజీ ఎల్‌.కె.వి.రంగారావు ఎదుట లొంగిపోయారు. ● పాంగి ముసిరి అలియాస్‌ చిట్టిబాబు మిలీషియా కమాండర్‌గా పని చేస్తున్నాడు. పెదబయలు జామిగుడా పంచాయతీ సాకిరేవు గ్రామానికి చెందిన ఇతడు 2010 నుంచి మావోయిస్టు పార్టీతో మిలీషియాగా తిరుగుతుండేవాడు. 2019 నుంచి బూసిపుట్టు ప్రాంతానికి మిలీషియాగా కమాండర్‌గా పనిచేస్తున్నాడు. జీపులు, రోడ్డురోలర్‌, పొక్లెయిన్‌లను కాల్చివేయడం, రూఢకోటలో రోడ్డు తవ్విన సంఘటనల్లో పాల్గొన్నాడు. కరవు దాడి, కమ్యూనిటీ హాలు ధ్వంసం చేయడంలోనూ పాల్గొన్నాడు. ● ములగలవీధి గ్రామానికి చెందిన కొర్రా వెంకటరావు సాయుధ మిలీషియా సభ్యుడు. మూడేళ్ల నుంచి బలపం గ్రామ పంచాయతీ కాఫీ కమిటీ సభ్యుడిగా పని చేస్తూనే మావోయిస్టులకు సహకరిస్తున్నాడు. ● పాంగి గోపాలరావు ఆర్మ్‌డ్‌ మిలీషియా సభ్యుడిగా పని చేస్తున్నాడు. వెంకటరావుతో కలిసి మావోయిస్టు సమావేశాలకు స్థానికులను తీసుకువెళ్లడం మావోయిస్టులకు అడవిలో తోవలు చూపించడం చేస్తూ వచ్చారు.


సీత లొంగుబాటుతో కటాఫ్‌ ఏరియాలో మావోయిస్టు కార్యకలాపాలకు కొంతమేరకు చెక్‌పెట్టినట్లేనని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. వరుసగా కీలక నాయకుల అరెస్ట్‌లు, లొంగుబాట్లతో పార్టీలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

Post a Comment

أحدث أقدم