మళ్లీ దిల్లీ సరిహద్దుల్లోకి

నిరసనల కొనసాగింపునకు తరలివస్తున్న కర్షకులు సింఘు సరిహద్దు వద్ద ‘స్థానికుల’తో ఘర్షణ.. ఉద్రిక్తత టికాయిత్‌కు మద్దతుగా గాజీపుర్‌లో అన్నదాతల భారీ ప్రదర్శన

మళ్లీ దిల్లీ సరిహద్దుల్లోకి..

దిల్లీ: వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న రైతులు మళ్లీ దిల్లీ సరిహద్దు ప్రాంతాలకు భారీగా తరలివస్తున్నారు. శుక్రవారం వారంతా మరింత ఎక్కువ సంఖ్యలో మునుపటి ఆందోళన ప్రదేశాలకు చేరుకోవడం ప్రారంభించారు. సింఘు సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. చట్టాల రద్దు వరకు వెనక్కి తగ్గేదే లేదని రైతు నేతలు పునరుద్ఘాటించారు. ఆ మేరకు ఆరు నెలల పోరాటానికి సరిపడా నిత్యావసరాలను దీక్షా శిబిరాల వద్దకు తరలించడం ప్రారంభించారు. గాజీపుర్‌ దీక్షా స్థలి వద్దకు పశ్చిమ యూపీ నుంచి దాదాపు వెయ్యి మంది రైతులు శుక్రవారం ఉదయాన్నే చేరుకుని సంఘీభావం ప్రకటించారు. తమ నేత రాకేశ్‌ టికాయిత్‌కు వారంతా మద్దతుగా నిలిచారు. హరియాణాకు చెందిన అనేకమంది రైతులు దిల్లీ సరిహద్దులకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.
సింఘులో బాష్పవాయు ప్రయోగం
రైతులు సరిహద్దును వీడి వెళ్లాలని స్థానికుల పేరుతో కొందరు కర్రలతో వచ్చి సింఘు సరిహద్దులో ఘర్షణ పడ్డారు. రైతుల గుడారాలపైకి రాళ్లు రువ్వారు. కొన్ని టెంట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. ఫలితంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. ఖాళీ చేయాలంటున్నవారంతా కిరాయి గూండాలంటూ కొందరు వాలంటీర్లు రైతులకు సర్దిచెప్పి పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. టిక్రీ సరిహద్దు వద్ద కూడా ఇలాంటిదే పునరావృతమైంది. రెండుచోట్లా పెద్దఎత్తున బలగాలను మోహరించారు. ఉద్యమానికి రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) అధినేత అజిత్‌సింగ్‌ మద్దతు ప్రకటించారు.

మళ్లీ దిల్లీ సరిహద్దుల్లోకి..

టికాయిత్‌ పిలుపుతో కదిలిన రైతులు
ఉద్యమంపై ప్రభుత్వ తీరును తప్పుపడుతూ భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ గురువారం రాత్రి కన్నీరు పెట్టుకోవడం, ఆత్మహత్యకు సిద్ధమని ప్రకటించడం రైతుల్ని తీవ్రంగా కదిలించింది. యూపీలోని ముజఫర్‌నగర్‌లో వేల సంఖ్యలో రైతులు ‘మహా పంచాయత్‌’కు హాజరై టికాయిత్‌కు సంఘీభావం ప్రకటించారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు భాజపా వైఖరిని ఖండిస్తూ రైతులకు తొలిసారిగా బాహాటంగా మద్దతు ప్రకటించాయి. ఐఎన్‌ఎల్‌డీ, భీంఆర్మీ కూడా మద్దతు తెలిపాయి.
నేడు సద్భావన దినం
మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకుని శనివారం సద్భావన దినంగా పాటించాలని రైతులు నిర్ణయించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉపవాస దీక్ష చేస్తామని రైతు సంఘాల నేతలు సింఘూ సరిహద్దు వద్ద విలేకరులకు తెలిపారు. శనివారం నిరాహార దీక్షలు పాటించి, రైతులకు సంఘీభావం ప్రకటించాలంటూ పౌర సమాజ ప్రతినిధులు ప్రశాంత్‌భూషణ్‌, అరుణారాయ్‌ పిలుపునిచ్చారు.
సమాచారం ఉంటే తెలపండి
హింసాత్మక ఘటనలపై ఎలాంటి సమాచారం, ఆధారాలున్నా తమకు తెలపాలని ప్రజలకు, పాత్రికేయులకు దిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆధారాల కోసం ఫోరెన్సిక్‌ నిపుణులు, క్రైం బ్రాంచ్‌ అధికారులు గాజీపుర్‌ సరిహద్దును సందర్శించారు. పలు నమూనాలు సేకరించారు.
* ఎర్రకోట ఘటనపై దర్యాప్తులో సహకరించాలంటూ 9 మంది రైతు నేతలకు ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్‌) పోలీసులు వాట్సప్‌ ద్వారా నోటీసులు పంపించారు. ఒక పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేశారనే ఆరోపణపై 9 మంది రైతుల్ని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
* తాజా పరిస్థితుల నేపథ్యంలో హోం మంత్రి అమిత్‌షా పశ్చిమబెంగాల్‌ పర్యటనను వాయిదా వేసుకున్నారు. దిల్లీ సరిహద్దులకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాలని శిరోమణి అకాలీదళ్‌ పార్టీ తమ శ్రేణులకు పిలుపునిచ్చింది.

Post a Comment

أحدث أقدم