ఏపీలో భాజపా నేతల గృహనిర్బంధం


ఏపీలో భాజపా నేతల గృహనిర్బంధం

అమరావతి: విజయనగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా నేడు భాజపా, జనసేన తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్రపై ఉత్కంఠ నెలకొంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలు సిద్ధమవుతుండగా...ఇప్పటికే కొందరిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎవరెన్ని ఆంక్షలు విధించినా ఈ కార్యక్రమం ఆగదని భాజపా స్పష్టం చేసింది.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని కొండపై ఇటీవల కోదండరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రాష్ట్రస్థాయిలో పెద్ద దుమారమే రేగింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై కొరు ఆరోపణ, ప్రత్యారోపణలు చేసుకున్నారు. విగ్రహ ధ్వంసంపై  ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భాజపా, జనసేన సంయుక్తంగా రామతీర్థ ధర్మయాత్ర తలపెట్టాయి. ఈయాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు జనసేన నేతలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, పవన్‌ హాజరుపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. రామతీర్థంలో రాముని విగ్రహ ధ్వంసంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ధర్మయాత్రకు వెళ్తున్న పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. గుంటూరులోని ఆయన నివాసంలో కన్నా లక్ష్మీనారాయణను గృహనిర్బంధం చేశారు. పార్వతీపురంలో భాజపా నేత ఉమామహేశ్వరరావును గృహనిర్బంధంలో ఉంచారు. మరో 25 మంది భాజపా నేతలకు ముందస్తు నోటీసులు ఇచ్చి గృహనిర్బంధం చేశారు. గృహ నిర్బంధంపై కన్నా మండిపడ్డారు. పోలీసుల సాయంతో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్యాక్షనిస్టు పాలన సాగుతోందని విమర్శించారు.

Post a Comment

Previous Post Next Post