రామతీర్థం విగ్రహ ధ్వంసం పక్కా ప్లాన్‌తో: రంపంతో తలకోసి.. విచారణలో దిమ్మతిరిగే నిజాలు!


విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహ ధ్వంసం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఐపీఎస్ సునీల్ కుమార్ వెల్లడించారు.
    
విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం సీఐడీ బృందం రామతీర్థంలో పర్యటించింది. బోడికొండపై ఉన్న కోదండ రాముడి విగ్రహం ధ్వంసం ఘటన జరిగిన ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు. ఈ వ్యవహారంపై జగన్ ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ నేతృత్వంలోని బృందం ఆ ప్రదేశానికి వెళ్లింది. ఆలయ పరిసరాలను పరిశీలించిన అనంతరం సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ మీడియాకు సంచలన విషయాలు వెల్లడించారు.

రామతీర్థం విగ్రహ ధ్వంసంపై సీఐడీ విచారణ

ఈ ఘటన జరిగిన తీరును చూస్తుంటే పక్కా ప్రణాళికతోనే విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు ఉందని డీజీ సునీల్ కుమార్ చెప్పారు. విగ్రహం తలను ఆక్సా బ్లేడ్‌ (రంపం)తో ఖండించినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని వెల్లడించారు. ఆ ప్రదేశంలో రంపం దొరికిందని చెప్పారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి అనేక ఆధారాలు సేకరించామని వెల్లడించారు.

గుడిలోని ఆభరణాలు, వస్తువులు చోరీకి గురి కాలేదన్నారు. అయితే దేవాలయం గురించి బాగా తెలిసిన వ్యక్తులే ఈ పని చేసేందుకు అవకాశముందని కీలక విషయాలు వెల్లడించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ఇలాంటి దుర్ఘటనకు పాల్పడి ఉండొచ్చని సునీల్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తామని.. త్వరలోనే దోషులను పట్టుకుంటామని సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌కుమార్‌ తెలిపారు.

Post a Comment

أحدث أقدم