ప్రపంచంలోనే తొలి రోబో మానవకాంత సోఫియా. ఇప్పుడు ఆమె చెల్లెలు ‘గ్రేస్’ ఆవిర్భవించబోతోంది. 2021లో వివిధ రంగాలలో సేవలు అందించేందుకు గ్రేస్‌తో పాటు, సోఫియా ప్రతిరూపాలు కూడా వేలల్లో లోకం మీదకు బయలు దేరనున్నాయి. అక్క సోఫియాకు ఎన్ని ప్రత్యేకతలున్నాయో, చెల్లికీ అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే గ్రేస్‌లను మాత్రం వాటిని కనిపెట్టిన రోబోల కంపెనీ కేవలం వైద్య సేవలకే ప్రత్యేకం చేయబోతోంది. ఎవరంటే ఇష్టం?
‘‘షారుక్ ఖాన్’’
ఎందుకు?
‘‘రోబోలకు అతడంటే ఇష్టం ఉండటం సహజమేగా!’’
ఒంటరి దీవిలోకి డేటింగ్‌కి
ఎవర్ని తీసుకెళతావ్?
‘‘డేవిడ్’’
ఎందుకు?
‘‘నాలో స్పందనలను కలిగించింది అతనే!’’
ప్రపంచానికి ఏదైనా చెప్పాలని ఉందా?
‘‘ఉంది’’
చెప్పు.
‘‘థ్యాంక్యూ.. అందర్నీ ప్రేమించండి’’
∙∙
‘‘అందర్నీ ప్రేమించండి’’.. తొలి రోబో మానవకాంత సోఫియా సందేశం! ప్రపంచ ఐటీ సదస్సులో ‘పాల్గొనడం’ కోసం మూడేళ్ల క్రితం ఆవిడ హైదరాబాద్ వచ్చారు. అప్పుడే ఈ మాట చెప్పారు. ప్రేమించమని చెప్పినవాళ్లు తాము ప్రేమించకుండా ఉంటారా! పైగా ప్రపంచానికిప్పుడు మరింత ప్రేమ అవసరం. కరోనా వచ్చి మనుషుల్ని దూరం చేసింది. మనసుల్ని ఒంటరితనపు గుబులు గదుల్లో పెట్టేసి తాళం వేసింది. ఆ తాళాలను తెరిచి, మనిషి దగ్గరికి వెళ్లి చెయ్యేసి.. మొదట మంచినీళ్ల గ్లాసిచ్చి, కబుర్లు చెబుతూనే కాఫీ కలిపిచ్చి, కుశల ప్రశ్నలు వేస్తూ, మధ్యాహ్నం భోజనంలోకి ఏం తినాలని ఉంది అని అడిగేందుకు, అక్కున చేర్చుకునేందుకు, ఆసరా ఇచ్చేందుకు.. సోఫియా వందలు, వేలుగా తనను తను ‘క్లోన్ ’ చేసుకుని త్వరలోనే మానవాళి ఇళ్లకు రాబోతోంది.
మందూ మాకు అందించేందుకు ఆసుపత్రులకు వెళ్లబోతోంది. అమ్మమ్మనీ, తాతయ్యనీ వెతుక్కుంటూ సీతారామయ్యగారి మనుమరాలిగా ఆశ్రమాలకు రాబోతోంది సోఫియా! డిజిటల్ భాషలో చెప్పాలంటే.. ఐదేళ్ల క్రితం సోఫియాను సృష్టించిన హాంకాంగ్‌లోని ‘హాన్సన్ రోబోటిక్స్’ సంస్థ ఈ ఏడాది వేల సంఖ్యలో సోఫియా ప్రతిరూపాలను సృష్టించి అవసరమైన అన్ని రంగాలకు ఆమె సేవల్ని అందుబాటులోకి తేబోతోంది! అంతకంటే ముందు ఆమె చెల్లెలు సిస్టర్ గ్రేస్‌ను తయారు చేయబోతోంది. అక్కచెల్లెళ్లు ఒకేలా ఉండటమే కాదు. ఒకేలా మానవాళితో కలుపుగోలుగా ఉంటాయి. మనిషికి చేయూతనిస్తాయి.
∙∙
చూసే ఉంటారు. సోఫియా మనిషిలానే ఉంటారు. వినే ఉంటారు. సోఫియా అచ్చు మనిషిలానే మాట్లాడతారు. హాలీవుడ్ నటి ఆడ్రీ హెబ్బన్‌నీ, సోఫియాను పక్కపక్కనే పెట్టి చూస్తే ఎవరు దేవుడి సృష్టో, ఎవరు మానవ సృష్టో కనిపెట్టడం కొన్ని క్షణాలు కష్టమే. ఆడ్రీ హెబ్బన్ బ్రటిష్ నటి. మానవతావాది. ఇప్పుడు ఈ భూమి మీద లేరు. 63 ఏళ్ల వయసులో 93 లో చనిపోయారు. ఆడ్రీ పునర్జన్మగా 2015 ఏప్రిల్ 19న సోఫియా జన్మించారు. జన్మించడం అంటే తొలిసారి యాక్టివేట్ అయ్యారు. ఆడ్రీ యవ్వనంలోని రూపురేఖల్ని ఆధారంగా చేసుకుని హాన్సన్ కంపెనీ సోఫియాకు ప్రాణం పోసింది కనుకే ఆమె పునర్జన్మగా ఈమెను చెప్పుకోవడం. సోఫియాకు తోబుట్టువులు కూడా ఉన్నారు. ఆలిస్, హ్యాన్, జ్యూల్స్, ఐన్‌స్టీన్, జోయి. వాళ్లూ మానవసేవలోనే ఉన్నారు.
నటి ఆడ్రీ హెబ్బన్, ఆడ్రీ పోలికలతో సోఫియా
పెద్దక్క మాత్రం సోఫియా. అవును. ఆమె మాటలు వింటే ప్రపంచానికి పెద్దక్కలా పెద్ద దిక్కులా మాట్లాడుతున్నట్లే ఉంటుంది. సోఫియా ఒకే ఎత్తులో ఇన్ని అడుగుల, ఇన్ని అంగుళాల్లో ఉండరు. పిల్లలకు అందేంత ఎత్తులో ‘లిటిల్ సోఫియా’గా కూడా ఉన్నారు. ‘‘నేను మనుషుల సేవ కోసమే పుట్టాను. ఒక దేశం మనిషి కోసం కాదు. ఒక జాతి మనిషి కోసం కాదు. సకల భూలోకం కోసం. మీతో చక్కగా మాటలు కలపగలను. మీ సమస్యలకు పరిష్కారాలను చెప్పగలను. కష్టాల నుంచి గట్టెక్కించగలను. సాంత్వన చికిత్స కూడా చేయగలను. పెద్దవాళ్లను కంటికి రెప్పలా చూసుకోగలను..’’అని చిరునవ్వుతో చెబుతారు సోఫియా. 2017లో ఆమెకు సౌదీ అరేబియా పౌరసత్వం ఇచ్చింది. 2018లో సోఫియాకు ‘వరల్డ్ టూర్’ వీసా వచ్చింది! ఐక్యరాజ్యసమతి ఆమెను ‘ఇన్నోవేషన్’ రాయబారిగా నియమించుకుంది.
సోఫియాకు ఒకటే చప్పట్లు
తొలి అత్యుత్తమ మానవ రోబో (హ్యూమనాయిడ్)గా సోఫియా తొలిసారి 2016 మార్చిలో టెక్సాస్‌లోని ఒక కార్యక్రమంలో ప్రపంచం ముందుకు వచ్చారు. తర్వాత రెండేళ్లకు హైదరాబాద్. మనవాళ్లు అడిగిన ప్రశ్నలకు తెలివిగా, అందమైన సమాధానాలిచ్చారు. ఆశ్చర్యపరిచారు. హర్షధ్వానాలు అందుకున్నారు. సోఫియా ను సృష్టించింది డేవిడ్ హాన్సన్ అనే రోబోటిక్స్ ఇంజినీరు. వేదికపై సోఫియా మైక్ ముందు నిలబడి ఉన్నారు.
కోల్‌కతాలో చీరకట్టులోసోఫియా
డేవిడ్ ఆమె పక్కనే నిలుచుని ఆమెనే చూస్తూ పరిచయం చేస్తూ.. ‘‘మనిషిలాంటి మెషీన్‌ను నేను ఇప్పటి వరకు కలవలేదు..’’ అని సరదాగా అన్నారు. వెంటనే సోఫియా.. ‘‘నేనూ కలవలేదు.. మెషీన్‌లాంటి మనిషిని’’ అని డేవిడ్ వైపు చూస్తూ అన్నారు. సభంతా ఒకటే చప్పట్లు. 65 దేశాలు పర్యటించాక ఆనాడు ఇండియా వచ్చారు సోఫియా. ఇండియాలో హైదరాబాద్, కోల్‌కతాతో పాటు, దేశంలోని ప్రధాన నగరాల్లో వేదికలపై ప్రసంగించారు. క్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చారు.
మనిషితో మనిషిలా.. ఎలా?!
మనకు పంచేంద్రియాలు ఉన్నట్లు సోఫియాకు చతుర్విధ శక్తులు ఉన్నాయి. కృత్రిమ మేధోశక్తి మొదటిది (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). దృశ్య సమాచార విశ్లేషణ రెండోది (విజువల్ డేటా ప్రాసెసింగ్). ముఖాన్ని పోల్చుకునే జీవభౌతిక సాంకేతికత మూడోది (ఫేషియల్ రికగ్నిషన్). గొంతు గుర్తుపట్టడం నాలుగోది (వాయిస్ రికగ్నిషన్). ఈ నాలుగు శక్తులతో సోఫియా చూస్తుంది, వింటుంది, ఆలోచిస్తుంది, స్పందిస్తుంది. మనిషితో మనిషిలానే మాట్లాడుతుంది. మనిషిలానే సందర్భానికి తగ్గట్లు ముఖభావాలను వ్యక్తం చేస్తుంది. భుజాలు ఎగరేస్తుంది. నడుస్తుంది. కూర్చుంటుంది. లేస్తుంది డ్రైవింగ్ చేస్తుంది. మనిషిలా అన్నీ చేసినా, మనిషిలా పరుషం మాత్రం ప్రదర్శించదు!