దిల్లీలో టెన్షన్‌.. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత


దిల్లీలో టెన్షన్‌.. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత! 
 

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్‌ తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారింది. పోలీసులు అనుమతించిన రూట్‌ మ్యాప్‌ను పక్కనపెట్టి రైతులు ఎర్రకోట వైపు దూసుకెళ్లడం కలకలం రేపింది. ఎర్రకోట బురుజులపైకి ఎక్కిన రైతులు అక్కడే జెండాలతో నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో కేంద్రం ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. రాత్రి 12గంటల వరకు టెలికాం, ఇంటర్నెట్‌ సేవలు నిలుపుదల చేస్తున్న్టట్టు వెల్లడించింది. శాంతిభద్రతల దృష్ట్యా సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌, ముఖుర్దాచౌక్‌, నగ్లోయ్‌ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేత
మరోవైపు, గణతంత్ర పరేడ్‌తో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. దేశ రాజధాని నగరంలో ఉద్రిక్తతల నేపథ్యంలో దిల్లీ మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. తొలుత ఐటీవో మెట్రో స్టేషన్‌ ప్రవేశ, నిష్క్రమణ గేట్లు మాత్రమే మూసివేసిన అధికారులు.. ఆ తర్వాత జామా మసీద్‌, దిల్షద్‌ గార్డెన్‌, జిల్మిల్‌, మానసరోవర్‌ పార్కు, ఇంద్రప్రస్థ తదితర స్టేషన్లను మూసివేశారు. 

నంగ్లోయ్‌ వద్ద ఉద్రిక్తత
నంగ్లోయ్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ట్రాక్టర్లపై వస్తున్న అన్నదాతలపై భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు వారిని చెదరగొట్టారు. 

Post a Comment

Previous Post Next Post