ఈ ప్రపంచానికి ఏమైంది..? కొవిడ్-19 ప్రభావం ముగిసిందని అనుకునేలోపే కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌తో దేశాలు గజగజ వణికిపోతున్నాయి. యూకేలో మొదలైన ఈ స్ట్రెయిన్ ఇప్పటికే పలు దేశాలకు పాకడంతో ఎలా నివారించాలో తెలియక దేశాధినేతలు తలలు పట్టుకుంటున్నారు. సాధారణ కరోనా వైరస్ కంటే ఈ స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతుండగా.. మరణాలూ అంతకంతకూ పెరిగిపోతుండటం కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే గతేడాది విధించిన లాక్‌డౌన్ ప్రభావం కారణంగా అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థల్ని గాడిన పెట్టే సవాళ్లు ముందుండగా.. స్ట్రెయిన్ కారణంగా మరోసారి లాక్‌డౌనే శరణ్యమనే పరిస్థితులు దాపురిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోగా.. జర్మనీ, స్కాట్లాండ్ దేశాలు అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాయి.
కీలక దశలో ఉన్నాం: బోరిస్
కరోనా వైరస్ స్ట్రెయిన్ కారణంగా ఇంగ్లాండ్‌లో కఠినమైన లాక్‌డౌన్ విధించే పరిస్థితి తప్పేటట్లు లేదని ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం మరోసారి ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలు మరోసారి ఆందోళనకు గురవుతున్నాయి. కరోనా వైరస్ పరివర్తనం చెంది స్ట్రెయిన్‌గా మారి వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ డిసెంబర్ నెలలోనే ఇంగ్లాండ్‌లో లాక్‌డౌన్ అమలు చేస్తూ.. నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బోరిస్ జాన్సన్ సోమవారం రాత్రి టెలివిజన్ ప్రసారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధులపై పోరాటంలో యూకే కీలక దశలో ఉందన్నారు. కాబట్టి మార్చి 2020లో అమలు చేసిన లాక్‌డౌన్ మాదిరిగానే ఇప్పుడు కూడా పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాలలు, వాణిజ్య సంస్థలు, అన్ని మూసివేయాలని ఆదేశించారు. ప్రజలు ఫిబ్రవరిలో ఇంటికే పరిమితం కావాలని ఆదేశించారు. ప్రస్తుతం దేశంలోని ఆస్పత్రులు కొవిడ్ రోగులతో ఎప్పుడూ లేనంతగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పడం ఆందోళన రేకిత్తిస్తోంది. కాగా యూకేలో వరుసగా ఏడో రోజు 50వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 58వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 27లక్షలకు చేరుకోగా.. మరణాల సంఖ్య 72వేలు దాటడం గమనార్హం.
అనవసర ప్రయాణాలు వద్దు: మెర్కెల్
జర్మనీలో కరోనా వైరస్ వ్యాప్తి స్థాయి ఆందోళనకరంగా ఉంది. మంగళవారం ఆ దేశంలో దాదాపు 944పైగా కరోనా మరణాలు నమోదైనట్లు ఆ దేశ వ్యాధుల నియంత్రణ విభాగం తెలియజేయటం.. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీంతో ఈ నెల ఆఖరు వరకు కఠినంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ఈ మేరకు దీర్ఘకాల లాక్‌డౌన్ అమలుపై మెర్కెల్ మంగళవారం గవర్నర్లతో సమావేశమయ్యారు. జర్మన్ ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని ఇప్పటికే ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తమ దేశ ప్రజలను కోరారు. కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు డిసెంబర్ 16న ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. నిత్యావసరాలు మినహా ఇతర వాణిజ్య సంస్థలను జనవరి 10 వరకు మూసేయాలని ఆదేశించింది. అంతేకాకుండా యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ జర్మనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైలు, బస్సు, ఓడ మార్గాలను కూడా మూసేసింది.
స్కాట్లాండ్
ఇంగ్లాండ్ బాటలోనే స్కాట్లాండ్ సైతం ప్రజలను ఇళ్లకు పరిమితం కావాలని ఆదేశించింది. ఈ మేరకు యూకేలోని స్కాట్లాండ్ ప్రధాని నికోలా స్టర్జన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలు కానున్న ఈ నిబంధనలు.. జనవరి చివరి వరకు కొనసాగుతాయని ఆమె తెలిపారు. విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, జిమ్‌లు మూసివేసేందుకు నిర్ణయించారు. ‘గతేడాది మార్చి నాటి పరిస్థితుల కంటే ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు’ అని నికోలా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో అంతకంతకూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. ఇంటి నుంచి పని చేయడం వీలు కాని పక్షంలో మాత్రమే ప్రజలు తమ పనులకు బయటకు రావాలని సూచించింది. చట్టవిరుద్ధంగా బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశించింది. కాగా స్కాట్లాండ్‌లో తాజాగా 13వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. సుమారు 2వేల కరోనా కేసులు నమోదయ్యాయి.
నెదర్లాండ్స్
కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో నెదర్లాండ్స్‌లో ఐదు వారాల పాటు పాక్షిక లాక్‌డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 19, 2021 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసరాలకు సంబంధించినవి మినహా ఇతర అన్ని వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, వ్యాయామశాలలు, సినిమా థియేటర్లు మూసివేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆ దేశ ప్రధాని మార్క్ రుట్టే మాట్లాడుతూ.. ‘నెదర్లాండ్ పూర్తిగా స్తంభించిపోయింది. స్ట్రెయిన్ వైరస్ తీవ్రతను క్రిస్టమస్‌కు ముందే అంచనా వేశాం’ అని తెలిపారు.
ఆస్ట్రియా
ఆస్ట్రియాలో కూడా కఠిన లాక్‌డౌన్ అమలు చేసేందుకు గడువు పొడిగిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెస్టారంట్లు, ఇతర వాణిజ్య సముదాయాల్ని జనవరి 24 వరకు మూసేందుకు నిర్ణయిస్తూ సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి రుడాల్ఫ్ సోమవారం నిర్ధరించారు. లాక్‌డౌన్ నుంచి బయటపడేందుకు ప్రవేశపెట్టిన ఉచిత కరోనా వైరస్ పరీక్షల పథకాన్ని తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది.
పోలండ్
కరోనా స్ట్రెయిన్‌ను అరికట్టేందుకు పోలండ్ సైతం మూడు వారాల పాక్షిక లాక్‌డౌన్‌ను విధించింది. డిసెంబర్ 28 నుంచి ఆయా లాక్‌డౌన్ నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఆదేశం న్యూఇయర్ వేడుకల్ని కూడా నిషేధించింది. జనవరి 17 వరకు ఈ లాక్‌డౌన్ కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. L