ప్రొద్దుటూరులో ఉన్మాది ఘాతుకం

ప్రేమించట్లేదని యువతిపై మచ్చుకత్తితో దాడి తెగిపడ్డ మూడు ఎడమ చేతి వేళ్లు రెండు వారాల క్రితమే చంపేస్తానని బెదిరింపు

ప్రొద్దుటూరులో ఉన్మాది ఘాతుకం

 కడప, ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ ఉన్మాది.. తనను ప్రేమించలేదని యువతిపై మచ్చుకత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటనలో ఆమె ఎడమ చేతి మూడు వేళ్లు తెగిపోగా తల, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను స్థానికులు వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ప్రొద్దుటూరులో ఉండే ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా రెండో కుమార్తె (17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసింది. మూడు నెలలుగా వివేకానంద కాలనీకి చెందిన సునీల్‌కుమార్‌ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా సునీల్‌ను ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్‌ చేశారు. అయినా అతనిలో మార్పు రాలేదు. రెండు వారాల క్రితం యువతి ఇంటికి వెళ్లి ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. చుట్టుపక్కల వారు రావడంతో వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు దుకాణానికి వెళ్లారు. ఆ సమయంలో సునీల్‌కుమార్‌ వెనుకవైపు నుంచి ఇంట్లోకి వెళ్లి.. యువతిపై మచ్చుకత్తితో దాడి చేసి పరారయ్యాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఒకటో ఠాణా సీఐ నాగరాజు, ఎస్సై శివశంకర్‌ ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. స్నేహితుల ప్రోత్సాహంతో సునీల్‌ తమ కుమార్తెను హత్య చేసేందుకు యత్నించారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం యువతిని కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.

ప్రొద్దుటూరులో ఉన్మాది ఘాతుకం


గతంలో వాలంటీరుగా పనిచేసిన సునీల్‌

వివేకానంద కాలనీకి చెందిన సునీల్‌ గతంలో వాలంటీరుగా పనిచేసేవాడు. విధులకు సక్రమంగా రావట్లేదన్న కారణంతో గతేడాది అతడిని అధికారులు తొలగించారు. ప్రస్తుతం సెంట్రింగ్‌ పనులు చేస్తున్నాడు. సునీల్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా ఈ యువతి పరిచయమైనట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.

ఆదివారం విజయవాడకు వెళ్లాలి

ప్రొద్దుటూరులో ఇంటర్‌ చదివిన మా బిడ్డ విజయవాడలో బీటెక్‌ చదివేందుకు సిద్ధమైంది. ఆదివారం ఆమెను విజయవాడ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. ఈలోపే ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు. సునీల్‌కుమార్‌ ఎన్నిసార్లు గొడవ చేసినా అమ్మాయి విషయమని సర్దుకుపోయాం. ఈ విషయాన్ని గతంలో పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లాం.

Post a Comment

أحدث أقدم