గొల్లపల్లి(ధర్మపురి): మండలంలోని వెంగళాపూర్‌లో మంగళవారం రాత్రి తాపీమేస్త్రీ ఎస్‌కే.ఇలియాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్యకుగల కారణాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. ఎస్‌కే.ఇలియాస్ జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన షేక్ మొమీనను ఇటీవల వివాహం చేసుకున్నాడు. కొంతకాలం పాటు అదే గ్రామంలో ఉండి, 17రోజుల క్రితం యశ్వంతరా వుపేటకు మకాం మార్చాడు. అయితే మొమీనకు గతంలోనే గొల్లపల్లి మండలం తిర్మాళాపూర్(పీడీ)కు చెందిన వ్యక్తితో వివాహం కాగా పాప, బాబు సంతానం. భర్త ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. ఈక్రమంలో మొమీనకు అదే గ్రామానికి చెందిన మరిది వరుస అయ్యే ఖదీర్‌తో పరిచయం ఏర్పడి అక్రమసంబంధం కొనసాగించారు.
విషయం గల్ఫ్‌లో ఉన్న భర్తకు తెలియడంతో విడాకులిచ్చాడు. దీంతో మొమీన తల్లిగారిల్లు బాటపట్టింది. మొమీనపై మనసు చంపుకోలేని ఖదీర్‌లో లక్ష్మీపూర్ వచ్చి వెళ్లేవాడు. అక్కడ వీరి బండారం బయటపడింది. పలుమార్లు పంచాయీతీలు జరిగాయి. మొమీన తనకే కావాలని ఖదీర్ పట్టుబట్టినా ఆమె తల్లిదండ్రలు ఒప్పుకోలేదు. ఈనేపథ్యంలో 2020 మేలో మొమీనకు ఇలియాస్‌తో వివాహం చేశారు. అయితే ఇలియాస్‌ను చంపితే మొమీన తనకే దక్కుతుందని ఖదీర్ భావించాడు. కొంతకాలం అతడి కదలికలపై నిఘా పెట్టాడు. ఈ నేపథ్యంలో వెంగళాపూర్‌లో పనిచేస్తున్న ఇలియాస్ మంగళవారం సాయంత్రం బైక్‌పై యశ్వంతరావుపేటకు వస్తుండగా ఖదీర్ లిఫ్టు అడిగి బైక్ ఎక్కాడు. వెంగళాపూర్ శివారు వద్దకు రాగానే పథకం ప్రకారం పదునైన కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనపై మరికొందరు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.