తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు మూలవేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్ (వేతన పెంపుదల) ఇవ్వాలని రాష్ట్ర వేతన సవరణ సంఘం ప్రభుత్వానికి సూచించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని సిఫార్సు చేసింది. ఉద్యోగుల కనీస వేతనం 19 వేలు...గరిష్ఠ వేతనం 1,62,070గా ప్రతిపాదించింది. 2018 జులై 1 నుంచి పెరిగిన 30.392 శాతం డీఏతో పాటు ఏడున్నర శాతం ఫిట్‌మెంట్ కలిపి వేతన స్కేళ్లు సవరించాలని పేర్కొంది. వనరుల స్థితి, వివిధ డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక ప్రయోజనం పొందే తేదీని ప్రభుత్వం ఖరారు చేయవచ్చని తెలిపింది.
2. కేంద్రం కన్నెర్ర
రైతుల ఆందోళన కారణంగా దిల్లీలో తలెత్తిన ఉద్రిక్తతపై కేంద్రం కన్నెర్ర చేసింది. పెద్దఎత్తున హింస చెలరేగడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. బుధవారం ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమై సమీక్షించారు. గణతంత్ర దినోత్సవం నాడు రణతంత్ర ర్యాలీ నిర్వహించి, ఎర్రకోటపై జెండాలు ఎగరేయడం, అనంతర పరిణామాలకు సంబంధించి 25 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సుమారు 200 మందిని పోలీసులు నిర్బంధంలో తీసుకున్నారు.
3. థియేటర్లకు 50% నిబంధన సడలింపు!
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం.. మరోవైపు టీకా పంపణీ మొదలు కావడంతో కేంద్ర హోం శాఖ ఇప్పటివరకూ విధిస్తూ వస్తున్న ఆంక్షలను మరింత సడలించడానికి సిద్ధమైంది. సినిమా హాళ్లు, ఇతర థియేటర్లలో ప్రస్తుతం అనుమతిచ్చిన 50% సీటింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి అనుమతివ్వబోతున్నట్లు బుధవారం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇప్పటివరకూ క్రీడాకారులకే అనుమతి ఉన్న ఈత కొలనుల్లో అందరిని అనుమతించనున్నట్లు ప్రకటించింది. కేవలం బిజినెస్ టు బిజినెస్ ఎగ్జిబిషన్ల వరకే ఉన్న అనుమతులను అని రకాల ఎగ్జిబిషన్ హాళ్లకూ విస్తరిస్తున్నట్లు వెల్లడించింది.
4. వాలంటీర్లు వద్దు
పంచాయతీ ఎన్నికల్లో గ్రామ వాలంటీర్లను వినియోగించరాదని, వారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనరు రమేశ్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తహసీల్దార్లు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలసత్వం వహించినట్లు ఫిర్యాదులొస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. ఉద్యోగుల విజ్ఞప్తులను ఎన్నికల సంఘం పరిశీలించి సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు. విజయవాడ నుంచి బుధవారం జిల్లాల్లోని ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో రమేశ్ కుమార్ పాల్గొన్నారు.
5. గ్రామాల్ని దోచుకునేందుకే ఏకగ్రీవాల జపం
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అరాచకాలకు ముకుతాడు వేయాలని ఓటర్లకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘వైకాపా నాయకులు ఇప్పటికే అడ్డూఅదుపూ లేకుండా రాష్ట్రంలో అభివృద్ధిని నాశనం చేశారు. గ్రామాల్లో వీరు రెచ్చిపోకుండా అడ్డుకునే ఎన్నికలు ఇవి’ అని వివరించారు. ‘గ్రామ స్వరాజ్యంపై, స్థానిక స్వపరిపాలనపై వైకాపాకు చిత్తశుద్ధి, విశ్వసనీయత లేవు. 20 నెలల పాలనలో వైకాపా ఏం చేసింది, అంతకుముందు తెదేపా ఏం చేసిందో ప్రజలే ఆలోచించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
6. భారత్ బయోటెక్ మలేరియా టీకా
బహుళ జాతి ఔషధ సంస్థ అయిన జీఎస్‌కే, ఆరోగ్య సేవల రంగంలోని స్వచ్ఛంద సంస్థ అయిన పాథ్ తో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ‘నూతన మలేరియా టీకా తయారీ’ ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాస్మోడియమ్ ఫాల్సిపారమ్ మలేరియా టీకాను జీఎస్‌కే 30 ఏళ్ల క్రితం ఆవిష్కరించింది. ఎంవిఐపీ (మలేరియా వ్యాక్సిన్ అమలు పథకం) కింద పాథ్‌తో కలిసి 2001 నుంచి ఘనా, కెన్యా, మలావి దేశాల్లో ప్రయోగాత్మకంగా ఈ టీకాలు ఇస్తోంది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) శాస్త్ర, సాంకేతిక సహకారాన్ని అందజేస్తోంది.
7. ప్రతినెలా ఐసీసీ అవార్డులు
క్రికెట్లో ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి ప్రతి ఏటా అవార్డులు అందజేసే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. ఇకపై ప్రతి నెలా పురస్కారాలను ఇవ్వాలని నిర్ణయించింది. కొత్తగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌లో అభిమానులతో పాటు ఐసీసీ ఓటింగ్ అకాడమీ సభ్యులు ఓటింగ్ ద్వారా విజేతలను ఎన్నుకుంటారు. ఇండిపెండెంట్ ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ ఆటగాళ్లు, బ్రాడ్‌కాస్టర్లు, విలేకరులు సభ్యులుగా ఉంటారు. పురుషులు, మహిళల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులను ప్రతి నెల గుర్తించే అవకాశం ఈ అవార్డుల ద్వారా లభిస్తుందని ఐసీసీ పేర్కొంది.
8. దృఢంగా తయారవ్వాలి
‘‘ఫిట్‌నెస్ అంటే కండలు తిరిగి ఉండటమే కాదు... ఏ పని చేయడానికి అయినా మన శరీరం సహకరించడం.’’ అంటోంది తాప్సి. తాను నటిస్తున్న ‘రష్మీ రాకెట్’ కోసం ఇటీవలే ఎన్ని కసరత్తులు చేసిందో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఈ అమ్మడు.. బాగా ఫిట్‌గా తయారైంది. తాజాగా ఆ చిత్ర షూటింగ్ రాన్ ఆఫ్ కచ్‌లో జరుగుతోంది. ఇందులో గ్రామీణ అథ్లెట్ అమ్మాయి పాత్ర పోషిస్తోంది తాప్సి. ఇక్కడ చిత్రీకరణ ముగింపు రోజు సరదాగా కొన్ని ఫొటోలు దిగింది. తెల్లని ఇసుకలో జర్కిన్ తీసి పుషప్స్ కొట్టింది. చిత్రబృందంలోని అబ్బాయిలతో పరుగుపోటీ పెట్టుకుంది.
9. బస్సు, ట్రక్కు ఢీకొని 53 మంది సజీవదహనం
మధ్య ఆఫ్రికా దేశం కామెరూన్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. తీరప్రాంత డౌలా నగరం నుంచి బఫౌసం వైపు వెళ్తున్న బస్సు శాంత్‌చౌ గ్రామం దగ్గర ట్రక్కును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 53 మంది మరణించగా.. 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. 70 మంది ప్రయాణికులతో వస్తున్న బస్సు అక్రమంగా ఇంధనం రవాణా చేస్తున్న ట్రక్కుపైకి దూసుకెళ్లిందని.. అనంతరం భారీగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారని చెప్పారు.
10. ‘బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను’
‘పెద్ద కుమార్తె శివుడు.. చిన్న కుమార్తె పార్వతి.. నేను కాళిక.. పెద్ద కుమార్తె రోజూ దేవుడితో మాట్లాడుతోంది’ అనే భావనతో చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఇద్దరు కుమార్తెల హత్య కేసులో నిందితురాలు పద్మజ ఉన్నట్లు తెలుస్తోంది. దేవుడు ఏ రోజు ఏం చేయాలో శివుడికి (పెద్ద కుమార్తె) చెబుతాడని.. ఆ ఆజ్ఞల ప్రకారం తాము పనులు చేస్తామని కూడా ఆమె చెప్పినట్లు సమాచారం. రిమాండ్ నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకున్నాయి.