సీతమ్మ విగ్రహం ధ్వంసం


విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లోని ఆలయంలో ఘటన
తెదేపా, భాజపా, ధార్మిక సంఘాల ఆందోళన

సీతమ్మ విగ్రహం ధ్వంసం

‌ విజయవాడ: రాష్ట్రంలో దేవతామూర్తుల విగ్రహాల విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. రామతీర్థం, రాజమహేంద్రవరం ఘటనలు మరువక ముందే విజయవాడలో మరో ఘటన చోటు చేసుకుంది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ ఆవరణలో ఉన్న సీతారామ మందిరంలో సీతాదేవి మట్టి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తెదేపా, భాజపా, పలు ధార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ ఆవరణలో 50 ఏళ్ల క్రితం రామాలయం నిర్మించారు. మొదట్లో ఆలయంలో సీతారాముల ఫొటోను పూజించేవారు. కొన్నాళ్ల క్రితం మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించారు. బస్‌స్టేషన్‌లో పనిచేసే కార్మికులు, ఆటోడ్రైవర్లు రోజూ విధుల్లోకి వెళ్లే ముందు ఆలయంలోని దేవుణ్ని దర్శించుకుంటారు. ఆలయానికి తలుపులు ఉన్నప్పటికీ భక్తులకు కనిపించేలా ఇనుప గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఆటోడ్రైవర్లు సీతమ్మ విగ్రహం కిందపడి పగిలిపోయి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. విగ్రహాన్ని ఎవరైనా పగలగొట్టారా? మరేదైనా కారణమా? అనేది తెలియదని.. తలుపులకు తాళం వేసినప్పటికీ ఆలయంలో కొబ్బరికాయ పిందెలు ఉండటం అనుమానాలకు తావిస్తోందని ఆటోడ్రైవర్లు పోలీసులకు తెలిపారు. విగ్రహం ధ్వంసమైన విషయం తెలుసుకున్న తెదేపా, భాజపా నాయకులతోపాటు పలు హిందూ ధార్మిక సంఘాల కార్యకర్తలు పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. ఎలుకలు లేదా గాలికి విగ్రహం పడిపోయి పగిలి ఉంటుందని కృష్ణలంక సీఐ సత్యానందం చెప్పడంపై తెదేపా నేత పట్టాభిరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేయకుండానే విగ్రహం పగిలిపోవడానికి ఎలుకలు కారణమని ఎలా నిర్ధారిస్తారని నిలదీయడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పూజారి రాజశేఖర్‌శర్మ మాట్లాడుతూ.. శనివారం ఉదయం ఆలయంలో పూజ చేసి తాళం వేసుకుని వెళ్లానన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆటోడ్రైవర్లు ఫోన్‌ చేసి అమ్మవారి ప్రతిమ పగిలిపోయి ఉందని చెప్పారన్నారు. విగ్రహం ఎలా ధ్వంసమైందో తనకు తెలియదని చెప్పారు.

సీతమ్మ విగ్రహం ధ్వంసం

తెదేపా, భాజపా నాయకుల ఆందోళన
సీతమ్మ విగ్రహం ధ్వంసమైన ఘటనను పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని తెదేపా, భాజపా నేతలు ఆందోళనకు దిగారు. దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ‘జగన్‌ మోహన్‌రెడ్డి హిందూ వ్యతిరేకి’ , ‘వెలంపల్లి శ్రీనివాస్‌ రాజీనామా చేయాలి’ అని నినాదాలు చేస్తూ ఆలయం ముందు బైఠాయించారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని, వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇచ్చేవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదన్నారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. డీసీపీ విక్రాంత్‌పాటిల్‌ వచ్చి ఆందోళన చేస్తున్న వారితో చర్చించారు. ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని, దోషులను కఠినంగా శిక్షించేలా చూస్తామని డీసీపీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది.
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే: దేవినేని ఉమా
‘ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతను కప్పిపుచ్చి ప్రజల దృష్టి మరల్చడానికి ఓ ప్రణాళిక ప్రకారం దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల బీసీ నాయకుడు సుబ్బయ్య హత్యపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టినీ మరల్చేందుకు రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం శిరస్సును తొలగించి కొలనులో పడేశారు. పాపభీతి, భయం లేకుండా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. 14 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జరుగుతున్న ఘటనలపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడం లేదు? మేం ఏమైనా మాట్లాడితే.. మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు’ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. సీతమ్మ విగ్రహ ధ్వంసానికి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.
దర్యాప్తు ముమ్మరం చేశాం: సీపీ
సీతమ్మ వారి విగ్రహం ధ్వంసం కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టామని విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. సింగంశెట్టి బాబూరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు సౌత్‌ ఏసీపీ ఎం.వెంకటేశ్వర్లు, కృష్ణలంక సీఐ సత్యానందం, సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. ఈ ఘటనలో 20 మందిని విచారించాం. ఆదివారం ఉదయం 5.30 గంటల వరకు విగ్రహం బాగానే ఉందని అమ్మవారిని దర్శించుకున్న డ్రైవర్లు చెప్పారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాల్సి ఉంది’ అని చెప్పారు.

Post a Comment

أحدث أقدم