వ్యాను, బస్సు ఢీ: ముగ్గురి దుర్మరణం
దెందులూరు: అతివేగం ముగ్గురు యువకులను బలి తీసుకుంది. తొందరగా ఇంటికి చేరుకోవాలనే ఉత్సాహంతో వాహనాన్ని వేగంగా నడపడంతో అది అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపుగా వస్తున్న బస్సును ఢీకొంది. ఈ ఘటనలో వ్యాను, బస్సు ముందుభాగాలు ధ్వంసమయ్యాయి. వ్యానులో ఉన్న ముగ్గురు యువకులు వాహనంలో ఇరుక్కుపోయి ఘటన స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జాతీయ రహదారిపై దెందులూరు సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుండగొలనుకు చెందిన పరసా రామకృష్ణ(25), వెలివెల గాంధీ(25), నాని (25)లు చేపలను పట్టి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఏలూరు వైపు నుంచి వీరు వ్యానులో బయలుదేరారు. మరో ఐదు నిమిషాల్లో గుండగొలను చేరుకుంటారనగా.. ఒక్కసారిగా వ్యాను అదుపుతప్పింది. డివైడర్‌ను దాటి రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇంద్ర బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాను నుజ్జు కావడంతో ముగ్గురు యువకులు అందులో చిక్కుకుపోయి మరణించారు. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఘటన స్థలానికి దెందులూరు ఎస్‌ఐ రామ్‌కుమార్, సిబ్బంది చేరుకొని వివరాలు సేకరించారు. హైవే పెట్రోల్ పోలీసులు వ్యాన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు.