అందరికీ కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలు నెరవేరితే ఆనందంతో ముఖం కళకళలాడిపోతుంది. ఇప్పుడు హీరోయిన్లు కృతీ సనన్, శ్రద్ధా శ్రీనాథ్ కూడా పట్టరాని సంతోషంలో ఉన్నారు. ఎందుకంటే వీళ్లిద్దరూ తమ కల నెరవేర్చుకున్నారు. నాజూకు సుందరి కృతీకి ఎప్పటినుంచో బైక్ నడపాలని కోరిక. బైక్ బరువైనా మోయగలుగుతావా? అని స్నేహితులు సరదాగా అంటే, ‘మీరే చూద్దురుగానీ’ అన్నారామె. అనడమే కాదు.. నేర్చేసుకుని రయ్ రయ్‌మంటూ ద్విచక్ర వాహనాన్ని నడిపేశారు కూడా. ప్రస్తుతం హిందీ చిత్రం ‘బచ్చన్ పాండే’లో నటిస్తున్నారు కృతీ సనన్.
ఈ షూటింగ్ లొకేషన్‌లో కాస్త గ్యాప్ దొరకడంతో బైక్ నడిపారు. ‘ఇంతకీ బైక్ ఎప్పుడు నేర్చుకున్నావ్?’ అని ఓ ఫ్రెండ్ అడిగితే ‘ఇవాళే మొదలుపెట్టాను. నేర్చేసుకున్నాను’ అన్నారు కృతీ సనన్. దీన్నిబట్టి ఈ బ్యూటీ ఎంత త్వరగా నేర్చేసుకున్నారో ఊహించవచ్చు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ విషయానికి వద్దాం. విహార యాత్రలకు వెళ్లినప్పుడు కేవలం ఎంజాయ్‌మెంట్ మాత్రమే కాదు... ఉపయోగపడేది ఏదైనా చేయాలనుకుంటారు శ్రద్ధా. హాలిడే కోసం ఇటీవల ఓ రిసార్ట్‌కి వెళ్లారామె. అక్కడ కుండలు తయారు చేయడం నేర్చుకున్నారు. ‘ఎప్పటినుంచో ఓ కుండ తయారు చేయాలనుకున్నా. ఇదిగో చేసేశా’ అంటూ ఫొటో షేర్ చేశారు శ్రద్ధా శ్రీనాథ్. బైక్ నడిపినందుకు కృతీకి, కుండ తయారు చేసినందుకు శ్రద్ధాకి బోలెడన్ని ప్రశంసలు లభించాయి.