పేదలకు పట్టాభిషేకo


తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలోని మోడల్‌ హౌస్‌; ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించనున్న పైలాన్‌ నేటి నుంచే నివాస స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి భూమి పూజలు

30.75 లక్షల మందికి గృహయోగం మొదటి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో సీఎం చేతుల మీదుగా నేడు శ్రీకారం రెండు వారాల పాటు ఊరూ వాడా పండుగ వాతావరణం

 అమరావతి: లక్షలాది కుటుంబాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నివాస స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి భూమి పూజలకు శుభ ముహూర్తం వచ్చేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు రెండు వారాల పాటు వాడవాడలా పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లబ్ధిదారుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీలు చక్కటి వసతులతో సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని వైఎస్సార్‌ జగనన్న కాలనీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం సిద్ధమైంది. ఇక్కడ సేకరించిన 367.58 ఎకరాల్లో 60 ఎకరాలను సామాజిక అవసరాలకు వదిలేసి 16,500 ప్లాట్లను చక్కగా రూపొందించారు. సీఎం జగన్‌ కడప నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకుని పైలాన్‌ను ఆవిష్కరించి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శనివారం నుంచి వచ్చేనెల ఏడో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ, భూమి పూజల కోలాహలం కొనసాగుతుంది. చదవండి: (ముందు లిమిటెడ్‌.. తరువాత రెగ్యులర్‌ డీఎస్సీ)

వాడవాడలా ఆనందోత్సాహాలు
► భారత దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో 30,75,755 మందికి నివాస స్థల పట్టాలు అందజేయడంతోపాటు వచ్చే మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

► మన ప్రభుత్వం వస్తే 25 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇస్తామని ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా విపక్షనేత హోదాలో ప్రకటించిన వైఎస్‌ జగన్‌.. సీఎం అయ్యాక ఏకంగా 30.75 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

► ఇంత మంచి కార్యక్రమం చేస్తే జగన్‌కు ప్రజల్లో ఎంతో పేరు ప్రతిష్టలు వస్తాయనే కసితో దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ నాయకులు శతవిధాలా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేకులు వేయించేందుకు వెనకుండి కోర్టుల్లో కేసులు వేయించారు. ఇలా కోర్టు కేసుల్లో ఉన్న లేఅవుట్లలోనివి మినహా మిగిలిన వారందరికీ ఇళ్ల స్థల పట్టాలను ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.

► రూ.50,940 కోట్ల అంచనా వ్యయంతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.28,080 కోట్ల వ్యయంతో మొదటి విడతలో నిర్మించ తలపెట్టిన 15.60 లక్షల ఇళ్లకు వచ్చే నెల ఏడో తేదీ వరకూ ప్రజా ప్రతినిధులు శంకుస్థాపనలు చేస్తారు. వాస్తవాలను కోర్టులకు నివేదించడం ద్వారా స్టేలను ఎత్తివేయించి మిగిలిన 3.51 లక్షల మందికి కూడా త్వరలో ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే దిశగా రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

అర్హతే ప్రామాణికం
► కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రాతిపదికగా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించారు. అర్హుల పేర్లెవరివైనా పొరపాటున మిస్సయితే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

► 68,361 ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూమిని సేకరించి పాఠశాలలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పార్కులు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లీనిక్‌లు, క్రీడా ప్రాంగణాలు లాంటి సామాజిక అవసరాల కోసం స్థలాలను వదిలేచి చక్కగా రహదారులు ఏర్పాటు చేశారు.

► రాష్ట్ర వ్యాప్తంగా 17004 వైఎస్సార్‌ జగనన్న కాలనీలను అధికారులు అభివృద్ధి చేశారు. ఈ కాలనీల్లో ప్లాట్లను అత్యంత పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా కేటాయించారు. తమకు కేటాయించిన ప్లాట్లను చూసేందుకు ఆయా కాలనీల వద్దకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు.

► ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా దారిద్య్రరేఖకు దిగువనున్న ఇల్లులేని పేద కుటుంబాలన్నింటికీ ఈ నెల 25 నుంచి నివాస స్థల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు గురువారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. 

‘తూర్పు’ నుంచే ‘పట్టా’భిషేకం
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం : పేదల సొంతింటి కలలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘తూర్పు’ నుంచి సాకారం చేస్తున్నారు. కాకినాడ–ఉప్పాడ బీచ్‌ రోడ్డుకు సమీపాన 367.58 ఎకరాల్లో సువిశాలమైన స్థలంలో పట్టాల పండుగకు సర్వం సిద్దమైంది. కొమరగిరి లే అవుట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమీనాబాద్‌ గ్రామంలో ప్రతిపాదిత ఫిష్షింగ్‌ హార్బర్‌కు ఐదు కిలోమీటర్లు, కాకినాడ స్మార్ట్‌ సిటీకి 11 కిలోమీటర్లు, కాకినాడ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌కు 12 కిలోమీటర్లు దూరాన కొమరగిరి లే అవుట్‌ ఏర్పాటైంది. 60 అడుగుల సువిశాలమైన ప్రధాన రహదారి, 40 అడుగులతో అంతర్గత రహదారులు, 20 అడుగులతో బ్లాకుల మధ్య రహదారులు ఏర్పాటు చేశారు. ప్రతి లబ్ధిదారుకు 60 చదరపు అడుగుల వంతున కేటాయించారు. కాగా, 2006 ఏప్రిల్‌ 1న మహానేత వైఎస్సార్‌ ‘తూర్పు’ సెంటిమెంట్‌తో ఇదే జిల్లా కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిగ గ్రామం నుంచి ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం గమనార్హం.

మహిళా స్వావలంబనకు పెద్దపీట
మరే రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్‌ వినూత్న రీతిలో మహిళా స్వావలంబనకు పెద్దపీట వేస్తున్నారు. మహిళల పేరుతో ఇన్ని లక్షల నివాస స్థల పట్టాలిచ్చి ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయం.  
– సుధామూర్తి, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌

జగన్‌ సర్కారుకు అభినందనలు
మహిళలకు ఇంత పెద్దఎత్తున ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం. నివాస స్థల పట్టా పొందుతున్న ప్రతి మహిళకూ హృదయపూర్వక శుభాభినందనలు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికీ అభినందనలు.  
– పరుగుల రాణి పీటీ ఉష

మహిళలకు రక్షణ కవచం
మహిళల అభ్యున్నతి, సాధికారతకు
సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుచేస్తోంది. ఏపీ తెచ్చిన ‘దిశ’ చట్టం మహిళలకు రక్షణ కవచంగా మారింది.
– నవనీత్‌ రవి రానా, మహారాష్ట్ర ఎంపీ

దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం
సీఎం జగన్‌ నిర్ణయం దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. 30 లక్షల మంది పేద మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలివ్వడమనేది మామూలు విషయం కాదు. మహిళలకు జగన్‌ సర్కారు ఇస్తున్న ప్రాధాన్యమేంటో అర్థమవుతోంది.  
– ఒలింపిక్‌ మెడల్‌ గ్రహీత కరణం మల్లీశ్వరి  


తూర్పుగోదావరి జిల్లా కొమరిగిరిలో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా పేదలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన లేఅవుట్‌

Post a Comment

أحدث أقدم