ఇళ్ల పట్టాల పంపిణీలో అధికారుల ఎదుటే వీరంగం
ఉరవకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: తమ భూమిలో పట్టాలను ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించిన ఓ దళిత రైతు కుటుంబంపై పోలీసు, రెవెన్యూ అధికారుల ఎదుటే పలువురు వైకాపా కార్యకర్తలు, నాయకులు దాడికి దిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని లత్తవరంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ గ్రామంలో సర్వే నంబరు 253-1లో 3.6 ఎకరాల భూమి ఉంది. ఇది గ్రామానికి చెందిన ఆనంద్, రత్నయ్య, ప్రకాష్, మనోహర్ అనే నలుగురు అన్నదమ్ములది. భూ పంపిణీలో భాగంగా దీనిని గతంలో ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇచ్చింది. తమ భూమిని ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం సేకరిస్తోందని తెలుసుకున్న ఆ నలుగురిలో ఒకరైన ఆనంద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అతడిది కాకుండా మిగతా ముగ్గురు అన్నదమ్ముల భాగానికి వచ్చిన పొలాన్ని ప్రభుత్వం రూ.23.93 లక్షలకు కొనుగోలు చేసి, లేఅవుట్‌ను ఏర్పాటు చేసింది. ఆ స్థలాల పంపిణీని బుధవారం అధికారులు చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకుని అక్కడికి చేరుకున్న రైతు ఆనంద్.. ‘మా అన్నదమ్ముల మధ్య పూర్తిస్థాయిలో భాగ పరిష్కారం కాలేదు. దీనిపై కోర్టును ఆశ్రయించాం.. ఇళ్ల స్థలాలను ఎలా పంపిణీ చేస్తారు...’ అని తహసీల్దార్, పోలీసులతో వాదనకు దిగి తీవ్ర పదజాలంతో దూషించారు. అవినీతికి పాల్పడి లేఅవుట్ వేయించారంటూ ఆరోపించారు. దీనిపై తహసీల్దార్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో... అధికారులను దూషిస్తారా అంటూ కొందరు వైకాపా కార్యకర్తలు, నాయకులు రైతు ఆనంద్, అతడి కుమారుడు కిశోర్, కుమార్తె రోజాపై దాడికి దిగారు. అక్కడి నుంచి వారు పరుగులు తీసినా వెంబడించి కొట్టారు. చివరకు ఆటో ఎక్కి తలదాచుకున్నా దాన్నీ చుట్టిముట్టి దాడి చేశారు. పోలీసులు వారిని కట్టడి చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్కడున్న ఇతర అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. బాధిత రైతు కుటుంబాన్ని ఎట్టకేలకు పోలీసులు అక్కడి నుంచి పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం అధికారులు పట్టాలు పంపిణీ చేశారు. కేసు విచారణకు వచ్చే సమయానికి లాక్‌డౌన్ కావడంతో కోర్టు ఆన్‌లైన్ స్టే ఇచ్చిందని బాధిత రైతు ఆనంద్ విలేకరులకు తెలిపారు.