గుంటూరు జిల్లాలో దారుణ హత్య!


గుంటూరు జిల్లాలో దారుణ హత్య!

గుంటూరు: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధసిరి గ్రామంలో జంపని నాగేశ్వరరావు అనే వ్యక్తి మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. స్థలం విషయంలో ఘర్షణ జరగడంతో మృతుడి సమీప బంధువుగా అనుమానిస్తున్న నిందితుడు ఈ చర్యకు ఒడిగట్టాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నిందితుడు గదిలోనే పెట్టి తాళం వేసి పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన జంపని నాగేశ్వరరావు పదిహేనేళ్ల కిందట గ్రంధసిరి గ్రామానికి వలస వచ్చాడు. సమీప బంధువుల ఖాళీ స్థలంలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నాడు. 

కూరగాయల వ్యాపారంతో పాటు మాంసం విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థల యాజమాని అయిన కిలారి నాగేశ్వరరావు తన స్థలం నుంచి ఖాళీ చేసి వెళ్లిపొమ్మన్నా.. జంపని నాగేశ్వరరావు అందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి జంపని నాగేశ్వరరావు.. కిలారి నాగేశ్వరరావును ఇంటికి ఆహ్వానించాడు. అనంతరం ఇరువురూ మద్యం తాగి స్థల విషయంలో గొడవ పడ్డారు. ఈ క్రమంలో కిలారి.. జంపని నాగేశ్వరరావును హత్య చేసినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

Previous Post Next Post