దిల్లీలో కీలక సూత్రధారి, చైనా వాసి అరెస్టు
హైదరాబాద్: సులభ పద్ధతుల్లో వ్యక్తిగత రుణాలిస్తామంటూ లక్షల మందికి అప్పులిచ్చి ఫోన్లలో వారిని బెదిరిస్తూ.. అధిక వడ్డీలతో వసూలు చేసుకుంటున్న యాప్‌ల అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. 30 మంది బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 15 రోజుల్లోనే సంచలన అంశాలను తెలుసుకున్నారు. చైనా దేశస్థులు కొందరు తెరవెనుక ఉండి నడిపిస్తున్న ఈ రుణ దందా ద్వారా కేవలం 6 నెలల్లోనే 1.4 కోట్ల లావాదేవీల ద్వారా రూ.21,000 కోట్ల వ్యాపారం చేశారని గుర్తించారు. ఇది కేవలం ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయం. మరోవైపు రుణాల యాప్‌ల రూపకల్పన, కాల్ సెంటర్ల నిర్వహణలో అన్నీ తానై వ్యవహరించిన చూ వుయ్ అలియాస్ లాంబోను పోలీసులు బుధవారం దిల్లీలో అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు తరలించి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. దిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లాంబోను సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ బి.రమేష్ దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ నుంచి షాంఘైకి వెళ్తుండగా విమానం ఎక్కేలోపు పట్టుకున్నారు. ఈ నెల 22న గురుగ్రాంలోని రెండు కాల్‌సెంటర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. లాంబో తన అనుచరుడు నాగరాజుతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి లాంబో కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఈ కేసులో దిల్లీలో అరెస్టయిన యాన్ యాన్ అలియాస్ జెన్నీఫర్ అనే చైనా దేశస్థురాలిని విచారించారు. ఆమె తెలిపిన సమాచారం ఆధారంగా లాంబో.. అగ్లో టెక్నాలజీస్, ల్యూఫాంగ్, న్యాబ్లూమ్, పిన్‌ప్రింట్ టెక్నాలజీస్ అనే పేర్లతో రుణ యాప్‌లు ప్రారంభించినట్లు తెలుసుకున్నారు. అనంతరం చైనాకు పారిపోతున్నాడన్న కచ్చితమైన సమాచారంతో బుధవారం తెల్లవారుజామున లాంబో, నాగరాజులను అరెస్టు చేసినట్లు అదనపు సీపీ(నేరపరిశోధన) శిఖా గోయల్ తెలిపారు.
రోజుకు రూ.10 కోట్ల వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో యాప్‌ల ద్వారా రుణాలిస్తున్న చైనా కంపెనీలు బాధితుల నుంచి రోజుకు రూ.10 కోట్లకుపైగా వసూలు చేస్తున్నట్లు సైబర్‌క్రైమ్ పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ నగదును తొలుత ఈ-వ్యాలెట్లలోకి బదిలీ చేసుకుని అనంతరం 340 వర్చువల్ ఖాతాల్లోకి డిపాజిట్ చేస్తున్నారు. ఆ తర్వాత వేర్వేరు కంపెనీల ఖాతాలు, వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించడంతోపాటు బిట్‌కాయిన్ల ద్వారా అంతర్జాతీయ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్నారని గుర్తించారు