పార్టీ పెట్టడం లేదు.. క్షమించండి..రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తాను
ANWtv:చెన్నై: ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పిన రజనీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రస్తుతం పార్టీ పెట్టట్లేదని ఆయన స్పష్టం చేశారు. తన ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారు. రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. పార్టీ కోసం ఎదురు చూసిన అభిమానులందరికీ క్షమాపణ చెపుతున్నానని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను రోడ్డు మీదకు వస్తే.. అది తన ఆరోగ్యానికే ముప్పుగా మారే అవకాశం ఉందని చెప్పారు.
వాస్తవానికి ఈ నెల 31న కొత్త పార్టీని ప్రకటించనున్నామని రజనీ తెలిపారు. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన పార్టీని ప్రకటించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇటీవలే హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. తీవ్రమైన బీపీ హెచ్చుతగ్గులతో ఆయన బాధపడ్డారు. ఈ నేపథ్యంలో, ఎంతో ఒత్తిడి ఉండే రాజకీయాలు వద్దని ఆయన కుమార్తె ఐశ్వర్యతో పాటు ఇతర కుటుంబసభ్యులు ఆయనను కోరారు. దీంతో, ఆయన పార్టీ పెట్టే యోచనను విరమించుకున్నారు. ఈ మేరకు ఆయన మూడు పేజీల లేఖను విడుదల చేశారు.