చరణ్‌... వరుణ్‌కు కరోనా... టాలీవుడ్‌లో టెన్షన్‌!





తాను కరోనా బారిన పడినట్టు యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ మంగళవారం ఉదయం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. తనకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలియజేశారు. గత రెండు మూడు రోజులుగా తనను కలిసిన వ్యక్తులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా రామ్‌చరణ్‌ కోరారు. త్వరగా కోలుకుని మరింత శక్తిమంతంగా తిరిగొస్తాననీ... ఎప్పటికప్పుడు రికవరీ గురించి వివరాలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు. మరో మెగా హీరో వరుణ్‌తేజ్‌ సైతం తాను కరోనా బారిన పడినట్టు మంగళవారం మధ్యాహ్నం వెల్లడించారు.

క్రిస్మస్‌ పార్టీలో కరోనా అంటుకుందా?

ఇటీవల మెగా కుటుంబంలోని కజిన్స్‌ అందరూ క్రిస్మస్‌కి కలిశారు. రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ సహా ఆ క్రిస్మస్‌ సంబరాల్లో హీరోలు అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, కల్యాణ్‌ ధేవ్‌, కొత్త జంట నిహారిక కొణిదెల - వెంకటచైతన్య జొన్నలగడ్డ, సుస్మితా కొణిదెల - విష్ణుప్రసాద్‌ దంపతులు పాల్గొన్నారు. అప్పుడు దిగిన ఫొటోను మెగా కజిన్స్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. చరణ్‌, వరుణ్‌ కరోనా బారిన పడటంతో ఆ క్రిస్మస్‌ పార్టీలో ఎవరో ఒకరి నుంచి వాళ్లిద్దరికీ అంటుకుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా బారిన పడిన హీరోలను పక్కన పెడితే... మిగతావాళ్ల సంగతేంటి? అనే చర్చలూ మొదలయ్యాయి.

 

టెన్షన్‌... టెన్షన్‌!

రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ కరోనా బారిన పడ్డారనే సంగతి తెలియగానే టాలీవుడ్‌లో టెన్షన్‌ మొదలైంది. ఎందుకంటే... ఇటీవల ‘ఆచార్య’ సెట్‌కి రామ్‌చరణ్‌ వెళ్లివచ్చారు. దర్శకుడు కొరటాల శివతో కరచాలనం చేస్తున్న ఫొటోలు బయటకొచ్చాయి. ఆ సినిమాలో చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌, సోనూ సూద్‌ తదితరులు నటిస్తున్నారు. అక్కడ ఎవరెవర్ని కలిశారన్నది ‘ఆచార్య’ యూనిట్‌కి తెలుసు. దాంతో వాళ్లలో టెన్షన్‌ మొదలైంది. క్రిస్మస్‌ రోజున ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ విడుదలైంది. సినిమాకు చక్కటి స్పందన లభిస్తోందని అదే రోజున దర్శక-నిర్మాతలు, కొంతమంది చిత్రబృందంతో కలిసి సాయి తేజ్‌ బాణాసంచా కాల్చారు. తర్వాత నభా నటేశ్‌తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మరి, ఆయనకు కరోనా సోకిందా? లేదా? ఆయన్నుంచి ఎవరికైనా అంటుకుందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ నెల 22న ‘షూట్‌-అవుట్‌ ఎట్‌ ఆలేరు’ వెబ్‌ సిరీస్‌ ప్రెస్‌మీట్‌కి రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందువల్ల, వాళ్లలోనూ కాస్త టెన్షన్‌ మొదలైంది. క్రిస్మస్‌ నుంచి మెగా కుటుంబంలో వ్యక్తులను కలిసిన టాలీవుడ్‌ ప్రముఖుల్లో ఓ విధమైన టెన్షన్‌ నెలకొంది.


కొత్త జంట పరిస్థితి ఏంటి?

క్రిస్మస్‌ పార్టీ తర్వాత నిహారిక-చైతన్య దంపతులు హనీమూన్‌ కోసం మాల్దీవులు వెళ్లారు. అందువల్ల, వాళ్లిద్దరూ పరీక్షలు చేయించుకొంటే మంచిదని ఇండస్ట్రీలో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే... క్రిస్మస్‌ పార్టీలో చరణ్‌, నిహారిక సన్నిహితంగా మెలిగారు. కొత్త జంటకు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ అని వస్తే హ్యాపీ! లేదంటే... వాళ్లు ప్రయాణించిన విమానంలో మిగతా ప్రయాణీకులు, మాల్దీవుల్లోని రిసార్టు సిబ్బంది గట్రా కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. 


ఉపాసన కూడా క్వారంటైన్‌లో...

‘‘నాకు పరీక్షలు చేయగా... ఫలితం నెగెటివ్‌ అని వచ్చింది. కానీ, కొవిడ్‌-19 పాజిటివ్‌గా మారే అవకాశం ఎక్కువగా ఉన్నందున మిస్టర్‌ సి (రామ్‌ చరణ్‌)తో కలిసి హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నా. వేడి వేడి ద్రవ పదార్థాలు తీసుకోవడంతో పాటు ఆవిరి పట్టుకుంటున్నాం. విశ్రాంతి తీసుకుంటున్నాం. చరణ్‌లో వ్యాధి తాలూకు లక్షణాలేవీ లేవు. స్ట్రాంగ్‌గా ఉన్నారు’’ అని రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పేర్కొన్నారు. చరణ్‌, వరుణ్‌ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు.

Post a Comment

Previous Post Next Post