తాడేపల్లి, న్యూస్‌టుడే: వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భర్త ప్రాణాలు కోల్పోయారంటూ భార్య, బంధువులు మణిపాల్ వైద్యశాల ఎదుట ధర్నాకు దిగిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిలకలూరిపేట ఇరిగేషన్ శాఖలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న కె.వెంకటశివకృష్ణ అనే వ్యక్తి విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా ఆయనకు మెడ వెనుక భాగంలో నొప్పి రావడంతో చికిత్స కోసం మణిపాల్ వైద్యశాలకు గత నెల 25న వచ్చారు. పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స అవసరమవుతుందని తెలిపారు. ఈనెల 7న శస్త్రచికిత్స చేసి, 9న ఇంటికి పంపారు. మళ్లీ మెడ నొప్పులు ప్రారంభమవడంతో 13న వైద్యశాలకు వచ్చారు. పరీక్షించిన వైద్యులు మరో శస్త్రచికిత్స అవసరమని చెప్పగా, 14న చేరారు. చికిత్స పొందుతూ 26న సాయంత్రం వెంకటశివకృష్ణ మరణించారు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి భార్య పావనికుమారి ఆరోపిస్తూ అదివారం ఉదయం ఆసుపత్రి వద్దకు బంధువులతో వెళ్లి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని, వైద్యులు, వైద్యశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పావనికుమారి కోరారు. ఎస్సై శ్రీనివాసరావు బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకొని శవపంచనామా చేశారు. సోమవారం గుంటూరు ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి, గుంటూరు మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ వైద్య బృందంతో పోస్టుమార్టం చేయిస్తామని ఎస్సై బాధితులకు చెప్పారు. అనంతరం పావనికుమారి వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంపై తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఈనెల 17న పావనికుమారి, తన భర్త మణిపాల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులు వ్యవహరిస్తున్న తీరుపై గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసి ఉన్నారు. మృతుడికి మూడేళ్ల బాబు హరిసూర్యచందన్, 9 నెలల చిన్నారి దీపశ్రీ ఉన్నారు.
ఆసుపత్రి ఎదుట బైఠాయించిన మృతుడి భార్య, బంధువులు