ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి టీవీ చూస్తూ తినే అలవాటు ఉంటుంది. భోజనం చేస్తూ టీవీ చూడటం లేదా రిలాక్స్‌గా టీవీ చూస్తున్నాం కాదా అని స్నాక్స్ తినడం చేస్తారు. అయితే ఇలా సమయం, సందర్భం లేకుండా టీవీ చూస్తూ తినడం ద్వారా ఎంత ఆహారం తీసుకుంటున్నామో పట్టించుకోం. దీంతో అవసరానికి మించి ఆహారం కడుపులో పడిపోతుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు రావడంతోపాటు తొందరగా బరువు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి టీవీ చూస్తూ మనల్ని మనం మర్చిపోయి తినకుండా.. మితంగా ఆహారం తీసుకునేలా కొన్ని చిట్కాలున్నాయి. వాటిని పాటిస్తే సరి..
టీవీ ముందు కూర్చుంటే ఎందుకు ఎక్కువ తింటాం?
ఏ పని చేస్తున్నా దానిపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే చేసే పనిపై అవగాహన ఉంటుంది. అలాగే ఆహారం తినేటప్పుడు కూడా.. దానిపైనే దృష్టి పెడితే పొదుపుగా తినగలం, కడుపు నిండితే మెదడే ఇక తినడం ఆపు అన్నట్లు సంకేతాలు ఇస్తుంది. కానీ, చాలా మంది తినేటప్పుడు టీవీ చూస్తూ మల్టీటాస్కింగ్ చేస్తుంటారు. ఆహారంపై పెట్టాల్సిన శ్రద్ధ టీవీపై పెడుతుంటడంతో.. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామనే విషయాలు మెదడు గుర్తించదు. గంటల తరబడి టీవీ ముందే కూర్చొని అధిక మోతాదులో ఆహారం లాగించేస్తారు.
మీకు ఆకలేస్తే టీవీ ముందుకు భోజనం తెచ్చుకోవడం కాదు, మీరే భోజనం వద్దకు వెళ్లండి. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని ఏకాగ్రతతో తినండి. తినే ఆహారాన్ని బాగా ఆస్వాదించండి. లేదా టీవీ ఆఫ్ చేసి భోజనం చేయండి. భోజనం చేయడానికి మహా అయితే 15 లేదా 20 నిమిషాలు పడుతుంది. అదే టీవీ చూస్తూ తింటే సమయం తెలియదు. ఆరోగ్యం కోసం పదిహేను నిమిషాలు ఆహారంపై శ్రద్ధపెట్టలేరా?
కుదరదునుకుంటే ఇలా చేసి చూడండి
ఒక్కసారిగా టీవీ చూస్తూ తినడం మానేయమంటే కాస్త కష్టంగానే ఉంటుంది. కాబట్టి మెల్లగా ఆ అలవాటును తగ్గించుకునే ప్రయత్నం చేయండి. టీవీ ముందు కూర్చొనేటప్పుడు భోజనమైనా.. పాప్‌కార్న్, పకోడీలు, మిర్చి వంటి చిరుతిళ్లయినా తక్కువ మొత్తంలో తెచ్చిపెట్టుకోండి. వాటిని తినడం పూర్తయ్యాక మళ్లీ తెచ్చుకోవడం మానేయండి.
వేరే పనులు చేయండి
ఖాళీగా కూర్చొని టీవీ చూస్తుంటే ఏదో ఒకటి తినాలనే అనిపిస్తుంటుంది. కాబట్టి, తినడం బదులు వేరే పనులు చేయండి. ఉదాహరణకు గోళ్లకు పెయింట్ వేసుకోవడం, కాళ్లకు మసాజ్ చేసుకోవడం వంటి చిన్న చిన్న పనులు చేస్తున్నట్లయితే తినాలనే ఆలోచనలు రాదు.
నీరు ఎక్కువగా తాగండి
టీవీ ముందు కూర్చొని ఏదైనా తినాలనిపిస్తే నీళ్లు తాగండి. కొంతమంది దాహం వేసినా చిరుతిళ్లు తినే అలవాటు ఉంటుంది. వాటి బదులు నీరే తాగితే కడుపు నిండిపోయి ఏమీ తినాలనిపించదు.