చిన్నప్పుడు స్కూల్‌లో సమాధానాలు అందరం బట్టీ పడుతుంటాం. ఆ సమాధానాలు ఎంతలా గుర్తుంటాయంటే నిద్ర లేపి అడిగినా టక్కున చెప్పేంత. ఆలియా కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ డైలాగులను ఇలానే గుర్తుపెట్టుకున్నారట. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తున్నారు. ఇటీవలే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశారు ఆలియా. ఈ షూటింగ్ గురించి ఆలియా మాట్లాడుతూ – ‘‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రీకరణ నాకో కొత్త అనుభవం. నాకు తెలుగు రాదు. అందుకే షూటింగ్‌లో జాయిన్ అయ్యే ముందే డైలాగ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. సుమారు ఏడాదిన్నరగా ఈ డైలాగ్స్ నేర్చుకుంటూనే ఉన్నాను. ఎంతలా అంటే నిద్రలో లేపి అడిగినా చెప్పేసేంత. రాజ మౌళి దర్శకత్వంలో నటించడం ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు.
కోవిడ్ లేకపోతే పెళ్లి: హీరో రణ్‌బీర్ కపూర్, ఆలియా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కోవిడ్ పరిస్థితుల్లో వాయిదా వేసుకున్నామని రణ్‌బీర్ పేర్కొన్నారు.