గుంటూరు : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కొండముచ్చు ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ సంఘటన మంగళవారం పిడుగురాళ్ల మండలం, జూలకల్లు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూలకళ్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం పెంపుడు కొండముచ్చును మీద ఎక్కించుకుని తన చుట్టూ గుమిగూడిన జనాలతో మాటలు చెబుతున్నాడు. జనం కూడా అతడు చెప్పే మాటలు వింటూ, కొండముచ్చు వంక చూస్తూ నవ్వసాగారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ కొండముచ్చు ఉన్నట్టుండి అతడిపై దాడి చేసింది. తలను కొరికి పై తోలు చీల్చి, నోటకరుచుకుపోయింది.
ఈ హఠాత్పరిణామంతో అతడు షాక్ తిన్నాడు. ఏం జరుగుతోందో తెలిసేలోపే క్షణాలో అతడి తలను తీవ్రంగా గాయపర్చి అక్కడినుంచి పరారైంది కొండముచ్చు. తీవ్రంగా గాయపడ్డ అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. కొండముచ్చులు ఉన్నట్టుండి దాడులకు తెగబడ్డాయి. గత ఫిబ్రవరి నెలలో నల్గొండ జిల్లా సూర్యా పేటలో ఓ వ్యక్తి బైకుపైకి ఎక్కిన కొండముచ్చు నమ్మకంగా ఉంటూ గొంతుకొరింది.