హైదరాబాద్: ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ అరంగేట్రం చేశాడు. లబుషేన్ (132 బంతుల్లో 48; ఫోర్లు 4) ను ఔట్ చేయడం ద్వారా తన తొలి మెయిడెన్ వికెట్ తీశాడు. ఇక సిరాజ్ టెస్టు ఎంట్రీ సందర్భంగా అతని సోదరుడు మహ్మద్ ఇస్మాయిల్ ఆనందం వ్యక్తం చేశాడు. తమ తండ్రి కలను సిరాజ్ నిజం చేశాడని అన్నాడు. తమకెంతో గర్వంగా ఉందని మీడియా పేర్కొన్నాడు. తన తమ్ముడి ఆటకోసం ఉదయం నాలుగు గంటలకే టీవీ ఆన్ చేశామని ఇస్మాయిల్ చెప్పుకొచ్చారు. ఇక తొలి టెస్టులో గాయపడటంతో మహ్మద్ షమీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. దాంతో సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కింది.
కాగా, మహ్మద్ సిరాజ్ తండ్రి ఊపితిత్తుల వ్యాధితో బాధపడుతూ గత నవంబర్‌లో హైదాబాద్‌లో మృతి చెందారు. అయితే, ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న సిరాజ్ కరోనా నిబంధనల మేరకు తండ్రి అంత్యక్రియలకు స్వదేశానికి రాలేకపోయాడు. అతను భారత్ వచ్చేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చినప్పటికీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా సిరాజ్ అక్కడే ఉండిపోయాడు. అతని నిర్ణయం పట్ల చాలా మంది క్రీడా ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఇక బాక్సింగ్ డే టెస్టులో తొలి సెషన్‌లో బౌలింగ్ చేసిన సిరాజ్ లబుషన్ వికెట్‌తో పాటు కామెరూన్ గ్రీన్ (60 బంతుల్లో 12)ను పెవిలియన్ పంపాడు. 15 ఓవర్లు వేసి 40 పరుగులకు 2 వికెట్లు తీశాడు. వాటిలో 4 ఓవర్లు మెయిడెన్ కావడం విశేషం. ఇదిలాఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 195 లకు ఆలౌట్ చేసిన టీమిండియా ప్రస్తుతం 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. 10 పరుగుల ఆదిక్యంలో కొనసాగుతోంది. అజింక్యా రహానే (62), రవీంద్ర జడేజా (12) క్రీజులో ఉన్నారు