విశాఖపట్నం : విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా తెదేపా, వైకాపా నాయకుల మధ్య ప్రమాణ సవాళ్లు నడుస్తున్నాయి. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి సాయిబాబా ఆలయంలో వైకాపా నాయకులు ప్రయాణం చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి సవాలు విసిరారు. ఇవాళ ఆలయంలో ప్రమాణాలు చేయాలని ఇరు పక్షాల నాయకులు నిర్ణయించుకున్నారు. దీంతో విశాఖ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడి వద్ద మూడంచెల పోలీసు పహారా ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వద్దకు తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాసేపట్లో ఎమ్మెల్యే పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నట్లు సమాచారం.