హైదరాబాద్: నల్లమల అడవి నుంచి గుడ్లగూబ పక్షులను తీసుకొచ్చి విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ యువకుడిని దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 15 పక్షులను స్వాదీనం చేసుకున్నారు. నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపిన మేరకు.. ఫలక్‌నుమా తీగలకుంట ప్రాంతంలో నివాసం ఉండే కమ్రాన్ అలీ ఫారూఖీ(22) ముర్గీచౌక్‌లో ఐదేళ్ల నుంచి పక్షులను విక్రయిస్తున్నాడు. అన్ని రకాల పక్షులపై అవగాహన పెంచుకున్న ఇతడు మంత్ర, తంత్ర శక్తులకు వినియోగించే పక్షులను కూడా అవసరమైన వారికి సమకూరుస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. తరచూ శ్రీశైలం నల్లమల అడవికి వెళ్లి పక్షులను పట్టుకొస్తుంటాడు. చదవండి: గుడ్లగూబ? గరుడ పక్షా?
ఈ క్రమంలోనే దట్టమైన అడవిలోని నీటి గుంటల వద్ద కాపుగాసి 15 గుడ్లగూబలను పట్టుకొని హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వీటిని అవసరమైన వారికి ఒక్కొక్కటి రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్‌్కఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలోని ఎస్‌ఐల బృందం ఎన్.శ్రీశైలం, మహ్మద్ తఖియుద్దీన్, కె.చంద్రమోహన్, వి.నరేందర్‌లు అటవీశాఖ అధికారులతో కలిసి ఫలక్‌నుమాలో అతన్ని అరెస్ట్ చేసి....15 పక్షులను కాపాడారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.