పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ఒకే పేగు తెంచుకుని పుట్టిన అన్నదమ్ములే ఆస్తి కోసం కొట్టుకుంటున్న నేటి రోజుల్లో అన్న హఠాన్మరణాన్ని తట్టుకోలేక తమ్ముడూ ప్రాణాలు విడిచిన విషాద ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. ఒకేరోజు అన్నాతమ్ముళ్లు గుండెపోటుతో కన్నుమూయడం వారి కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచెత్తింది. గుంటూరు ఫాతిమాపురానికి చెందిన తెదేపా కార్యకర్త షేక్ అబ్దుల్ నబీ (40) బేకరీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఆయనకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందారని నిర్ధారించారు. అన్న కళ్ల ముందే ప్రాణాలు విడవడం తమ్ముడు షేక్ దస్తగిరి (36) తట్టుకోలేకపోయారు. గుండెనొప్పితో అక్కడే కుప్పకూలారు. వైద్యులు పరీక్షించి దస్తగిరి కూడా కన్నుమూశాడని చెప్పారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం అలముకుంది. దస్తగిరి పెయింట్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అబ్దుల్ నబీకి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. దస్తగిరికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు పశ్చిమ తెదేపా ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర అన్నాతమ్ముళ్ల భౌతికకాయాలను సందర్శించి నివాళులర్పించారు. తెదేపా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు షేక్ చినబాజి, కనపర్తి శ్రీనివాసరావు, పోపూరి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో ఒకేరోజు అన్నాతమ్ముళ్ల మృతి
AMARAVATHI NEWS WORLD
0