రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం కుమార్తె పెళ్లి ఆహ్వానం ఇచ్చి వస్తుండగా దుర్ఘటన
ఏమోయ్..!
రేపు ఏ ఊరెళ్దాం.. అయినోళ్లు.. కానోళ్లని భేదం చూడొద్దు.. ఇది మన ఇంటి శుభకార్యం. పంతాలు, పట్టింపుల్లేకుండా మన్నోళ్లలందరికీ పత్రికలు పంచాల.. ఎన్ని ఇబ్బందులున్నా కూతుళ్ల సంతోషంలో మాత్రం రాజీ పడేది లేదు.
నాకు తెలుసులేండి..!!
నేనో మాటన్నా, పడనిచ్చేవారు కాదు.. పెద్దబిడ్డ, మహాలక్ష్మి పుట్టిందని అల్లారు ముద్దుగా చూసుకున్నారు. ఇంకో పది రోజులు మాత్రమే మనింట్లో ఉంటాది. ఆ తర్వాత అత్తారింటికి వెళుతుంది. అప్పుడెలా వదిలి ఉంటారో నేనూ చూస్తా..
సర్లేవోయ్..!
బిడ్డేమైనా పరాయి దేశం పోతాందా.. 20 మైళ్ల దూరంలో ఉంటాది. బండెక్కితే ముప్పావు గంటలో వెళ్లి నా బంగారు తల్లిని చూడనూ.. అవసరమైతే ఇద్దరినీ ఓసారి వచ్చిపొమ్మంట...
ఇలా.. బిడ్డకు పెళ్లవుతుందన్న ఆనందం.. ఇంకో పది రోజులే ఉందన్న హడావుడి.. ఒకరికొకరు భరోసానిచ్చుకుంటున్న సాగుతున్న ఆ ప్రయాణం.. విషాదాంతమైంది. వారి కలలను కల్లలు చేస్తూ.. మృత్యువు ప్రమాద రూపంలో వారిని కబళించింది. ఇద్దరు కుమార్తెలను అనాథలను చేసింది. పెళ్లింట విషాదం నింపింది.
న్యూస్‌టుడే, వరికుంటపాడు
కుమార్తె వివాహ తొలి పత్రిక వియ్యంకుడి ఇంట ఇచ్చి వస్తున్న ఆ దంపతులను ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ హృదయ విదారక సంఘటన వరికుంటపాడు మండలంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... ఉదయగిరి మండలం వడ్లమూడిపల్లికి చెందిన గంగి శ్రీనివాసులురెడ్డి(48), భార్య గంగి రత్తమ్మ(45) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వ్యవసాయమే జీవనాధారం. పెద్ద కుమార్తె డిగ్రీ పూర్తి చేయగా.. రెండో కూతురు ఇంజినీరింగ్ చదువుతోంది. ఇటీవల వరికుంటపాడు మండలం అండ్రావారిపల్లెకు చెందిన ఓ యువకుడితో పెద్దమ్మాయికి నిశ్చితార్థం చేశారు. జనవరి 7న వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే పెళ్లిపత్రికల ముద్రణ పూర్తవగా- తొలి పత్రికను వియ్యంకుడి ఇంట ఇవ్వాలన్న ఆచారం ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ అండ్రావారిపల్లెకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అనంతరం అదే మండలంలోని మరికొందరు బంధువుల ఇళ్లకువెళ్లి కార్డులు పంచారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో స్వగ్రామానికి వెళుతూ... మార్గం మధ్యలో జడదేవి గ్రామ సమీపంలో ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా- ఎస్సై ఉమాశంకర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాసుప్రతికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వడ్లమూడిపల్లిలో విషాదఛాయలు..
మరో పది రోజుల్లో దగ్గరుండి కుమార్తె పెళ్లి చేయాల్సిన తల్లిదండ్రులు.. విగతజీవులుగా మారడంతో వడ్లమూడిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. బిడ్డ పెళ్లికి.. అందరూ రావాలని.. అన్ని పనులు దగ్గరుండి చేయాలని గ్రామస్థులతో పదే పదే చెప్పిన దంపతులు.. బిడ్డలను అనాథలు చేసి వెళ్లిపోవడంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక తమకు దిక్కెవరంటూ రోదిస్తున్న ఆ కుమార్తెలను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.